ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలు హైదరాబాద్, వెలుగు: ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టైంది. తక్కువ ప్రీమియం ఎక్కువ రిటర్న్స్, ల్యాప్స్ పాలసీల రీ ఓపెన్ పేరుతో రూ.కోట్లు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్ గ్యాంగ్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ ఘజీయాబాద్‌లో అరెస్ట్ చేసి గురువారం హైదరాబాద్ తరలించారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.1.5 లక్షల క్యాష్, 8 ఏటీఎం కార్డులు,7 సెల్‌ఫోన్స్, 14 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ అనురాధ వెల్లడించారు.
యూపీ కేంద్రంగా ఫేక్ పాలసీ దందా
యూపీ ఘజీయాబాద్‌కు చెందిన వికాస్ సింగ్(28) ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాడు. ఇన్సూరెన్స్ పాలసీలు, ల్యాప్స్ పై అవగాహన పెంచుకున్నాడు. పాలసీ హోల్డర్లను మోసం చేసేందుకు స్కెచ్ వేశాడు. ఘజీయాబాద్‌లోని సైబర్ నేరగాళ్లు ముర్షీద్ అన్సారీ(32), సోను(32)తో కలిసి ఫేక్ కాల్‌సెంటర్ తెరిచాడు. తరుణ్ శర్మ(35), మనీశ్ టాంగెర్(34), లలిత్‌కుమార్(27) ను టెలికాలర్స్‌గా నియమించాడు.
ఫేక్ పాలసీకి రూ.కోట్లు విలువ చేసే నకిలీ డీడీలు
వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ల్యాప్స్ పాలసీల డాటా తీసుకొచి పాలసీ హోల్డర్లకు కాల్స్ చేసేవారు. తమ సంస్థల్లో పాలసీలు తీసుకోవాలని చెప్పేవారు. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని నమ్మించేవారు. వాట్సాప్‌లో కాంటాక్ట్‌తో పాలసీకి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకునేవారు. ఆ తరువాత పాలసీదారులను నమ్మించేందుకు రూ.2 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు నకిలీ డీడీలను క్రియేట్‌చేసేవారు. ఈ క్రమంలోనే పాలసీదారుల నుంచి 18 శాతం జీఎస్‌టీ, ఇతర చార్జీల పేరుతో అందినంతా దోచేశారు. ఇలా ఎల్బీనగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి(72)కి నవంబర్‌లో కాల్‌చేశారు.
ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నారు. అతనికి మరో ఐదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల్లో పాలసీలు ఉన్నట్లు చెప్పారు. రూ.5లక్షల పాలసీ పూర్తి అయినట్లు కూడా తెలిపారు. ల్యాప్స్ అయిన పాలసీలు తిరిగి ప్రారంభించాలని చెప్పారు.
12 మంది పేర్లతో ఫేక్ పాలసీ రూ.1.6 కోట్లు గోల్‌మాల్
తక్కువ ప్రీమియంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపారు.ముందుగా ఓ పాలసీ చేయించారు. బాధితుడి పేరుతో రూ.2 కోట్లు,రూ.4 కోట్లు,రూ.5 కోట్లు విలువ చేసే నకిలీ డిమాండ్ డ్రాఫ్ట్‌లు క్రియేట్‌చేసి వాట్సాప్‌లో షేర్‌చేశారు. దీంతో బాధితుడు తన ఫ్యామిలీలో 12మంది పేర్లతో పాలసీలు చేశాడు. ఇందుకోసం రూ.1.6 కోట్లు చెల్లించాడు. ఆ తరువాత ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూపీకి వెళ్లిన పోలీస్ టీమ్ సోను మినహా మిగితా ఐదుగురిని అరెస్ట్ చేసింది. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు.
©️ VIL Media Pvt Ltd.