టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సాగుతోంది. లోకేష్‌కు ఎదురుగా డిక్సన్ కంపెనీ బస్సు కనిపించింది.. ఆ బస్సు నిండా అక్కాచెల్లెళ్లు, వారిలో ఆనందం కనిపించిందన్నారు. తన కళ్ల వెంబడి ఆనందభాష్పాలు అప్రయత్నంగానే రాలాయి అన్నారు లోకేష్. నాలుగేళ్ల క్రితం తాను ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. తాను ఇప్పుడు పదవిలో లేనని.. కానీ తన ప్రయత్నం వేలాది మంది జీవితాలకు ఉపాధి మార్గం చూపింది అన్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వనరు అయ్యిందని.. ఆంధ్ర అభివృద్ధిలో డిక్సన్ కూడా ఒక భాగమైంది అన్నారు.
‘చిలుకను పెంచాను ఎగిరిపోయింది. ఉడుతను పెంచాను. పారిపోయింది. మొక్కను పెంచాను. ప్రస్తుతం ఆ రెండూ వచ్చి చేరాయి’ అని మిసైల్ మేన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన నిత్యసత్యం తాను నమ్మే సిద్ధాంతం అన్నారు లోకేష్. ‘మీలాంటి వారి విమర్శలు-ఆరోపణలు-హేళనలకు వెరవకుండా అష్టకష్టాలు పడి తెచ్చిన కంపెనీలు పచ్చని చెట్లు అయ్యాయి. ఈ నీడన ఉపాధి దొరుకుతోంది. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది’ అన్నారు.
తాను ఏపీకి తీసుకొచ్చిన డిక్సన్‌లో ఈ అక్కాచెల్లెళ్లు ఉద్యోగానికి వెళ్లడం చూసి తన గుండె గర్వంతో ఉప్పొంగింది అన్నారు. అప్పట్లో డిక్సన్ 100 కోట్ల పెట్టుబడి పెట్టారు.. ఈ కంపెనీ వల్ల 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 పరోక్ష ఉపాధి దొరికిందన్నారు. తాను పదులసంఖ్యలో కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాను. అన్ని కాకపోయినా ఒక్క కంపెనీ తెచ్చి యువతకి ఉపాధి కల్పించి చూపించగలవా మిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. డిక్సన్ మహిళా ఉద్యోగులతో లోకేష్ సెల్ఫీ దిగారు.
సత్యవేడు నియోజకవర్గం తిమ్మనాయుడుగుంటలో.. నగరిలో మంత్రి రోజా ఇంటికి చీర, గాజులు ఇవ్వడానికి వెళ్లి అరెస్టై బెయిల్ పై విడుదలైన చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అరుణ, మహిళా కార్యకర్తలకు చీర, గాజులు ఇచ్చి లోకేష్ నమస్కరించారు. గట్టిగా పోరాడారు అంటూ మహిళా కార్యకర్తలను అభినందించారు. మహిళా కార్యకర్తల పై పోలీసులు చెయ్యి చేసుకోవడం దారుణమని.. తెలుగు మహిళలు చేసిన తప్పేంటి? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న మంత్రి రోజా ఇంటికి చీర, గాజులు ఇవ్వడానికి వెళ్ళడం నేరమా అన్నారు. దళిత మహిళల పై పోలీసులు చేయి చేసుకొని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. తప్పుడు కేసులు బనాయించారు కాబట్టే బెయిల్ వెంటనే వచ్చిందని.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిని వదిలి పెట్టనని.. త్వరలో ఆటో డ్రైవర్ హమీద్ బాషా కి ఆటో కూడా అందజేస్తాను అన్నారు.
Read Latest
Andhra Pradesh News
and