భారత్‌తో రెండో టెస్టుకి ఆస్ట్రేలియా టీమ్‌లో మూడు మార్పులు? కెప్టెన్ కమిన్స్ హింట్

India vs Australia Delhi Test : భారత్‌తో శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టుకి ఆస్ట్రేలియా టీమ్ మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Captain Pat Cummins) గురువారం హింట్ ఇచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాట్ కమిన్స్.. మ్యాచ్‌కి టీమ్‌ సన్నద్ధత గురించి వివరిస్తూనే జట్టులో మార్పులు చేయబోతున్నట్లు కూడా చెప్పాడు. అలానే సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసే ఆలోచన లేదని కమిన్స్ స్పష్టం చేశాడు.

నాగ్‌పూర్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 10 పరుగులు మాత్రమే చేసిన వార్నర్.. భారత్ గడ్డపై టెస్టుల్లో పేలవ రికార్డ్‌ని కొనసాగించాడు. భారత్‌ గడ్డపై చివరిగా ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ సగటు కేవలం 22.16 మాత్రమే. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఐపీఎల్‌లో ఆడుతున్న వార్నర్.. ఆ టీమ్ సొంతగడ్డ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఫామ్ అందుకుంటాడని పాట్ కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు.

పాట్ కమిన్స్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే? టాప్ ఆర్డర్ బ్యాటర్ మాట్ రెన్షాపై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. నాగ్‌పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన రెన్షా చేసిన పరుగులు 0, 2 మాత్రమే. దాంతో అతడ్ని పక్కకి తప్పించి ట్రావిస్ హెడ్‌ని టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అలానే జట్టు నుంచి బోలాండ్‌ని తప్పించి కామెరూన్ గ్రీన్‌ని తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్ ఒకవేళ పేస్‌కి అనుకూలించేలా ఉంటే ముర్ఫీని కూడా తప్పించి పేసర్ మిచెల్ స్టార్క్‌ని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పుడు తుది జట్టులో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్, నాథన్ లయన్ రూపంలో నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లు మాత్రమే ఉండనున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ‘నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతాం’ అని క్లారిటీగా చెప్పేశాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లయన్, మిచెల్ స్టార్క్

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *