మునుగోడు గొర్రెల స్కీంలో బయటపడ్డ బండారం

మునుగోడు గొర్రెల స్కీంలో బయటపడ్డ బండారం నల్గొండ, వెలుగు: మునుగోడు గొర్రెల కొనుగోళ్ల వ్యవహారంలో మళ్లీ గందరగోళం నెలకొంది. బైపోల్ టైంలో పాత రూల్స్ పక్కనపెట్టి.. కొత్త రూల్స్ తెరపైకి తెచ్చిన సర్కారు, వాటిని అమలు చేయడంలో 

విఫలమైంది. ఎన్నికల టైంలో హడావుడిగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేసిన ప్రభుత్వం.. అసలు ఎంతమంది లబ్ధిదారులు వాటా చెల్లించారు? ఎంత మంది చెల్లించలేదు? అనే వివరాలు కూడా పరిశీలించలేదు. తీరా.. ఇప్పుడు లబ్ధిదారుల గురించి ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఫ్రీజింగ్ కు ముందే కొందరు డబ్బులు డ్రా చేసుకోగా.. మరికొందరు వాటాలు కట్టకుండానే డబ్బులు పొందారు.

ఇదీ అసలు కథ..

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని మొత్తం 7,600 మందికి గొర్రెలు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.93కోట్లు కేటాయించింది. డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) ద్వారా అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. ఎన్నికల టైంలో గొర్రెలు కొనడం సాధ్యం కాదని, లబ్ధిదారులు డబ్బులు డ్రా చేసుకునే చాన్స్ లేదని ప్రభుత్వం ఫ్రీజింగ్ లో పెట్టింది. అయితే అకౌంట్లు ఫ్రీజ్ చేయడానికి కంటే ముందే 450 మంది లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి మొత్తం రూ.1.75 కోట్లు డ్రా చేశారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలోని 300 మంది లబ్ధిదారులు తమ వాటాలు కట్టకున్నా.. వాళ్ల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. యూనిట్ కాస్ట్ లో లబ్ధిదారుడు తన వాటా కింద రూ.43,750 డిపాజిట్ చేయాల్సి వస్తోంది. మిగిలిన రూ.1,31,250 ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండానే సర్కారు డబ్బులు వేసింది.

తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు..

ఫ్రీజింగ్ లో పెట్టిన డబ్బులు ఎప్పుడు డ్రా చేశారు? వాటాలు కట్టని వారికి డబ్బులు ఎలా డిపాజిట్ అయ్యాయో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు. వాస్తవానికి జిల్లా అధికారుల నుంచి పంపిన ప్రపోజల్స్ ప్రకారమే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. కానీ అసలు లబ్ధిదారులు ఎవరో పరిశీలించకుండానే డబ్బులు డిపాజిట్ చేసింది. వాటిని లబ్ధిదారులు డ్రా చేసుకుని సొంత అవసరాలకు వాడుకున్నారు. తాజాగా, ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆశ్రయించారు. ఆయన లబ్ధిదారులతో మీటింగులు నిర్వహించి, నయానో భయానో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

పరువు పోవద్దని తండ్లాట..

బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకున్న లబ్ధిదారులు తిరిగి డబ్బులు అకౌంట్లలో జమ చేస్తేనే గొర్రెలు కొనియ్యడం సాధ్యమవుతుందని అధికా రులు చెబుతున్నారు. ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా ఒక్కొక్కరు రూ.1.30లక్షల చొప్పున వాడుకున్న వారిని  ఎలా బుజ్జగించాలో అర్థం గాక అయోమయంలో పడ్డారు. ఆడిట్ సమస్య వస్తే ఎవరు బదులు చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పడం లేదు. సర్పంచ్​లు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే భేటీ అయితేనే పరిష్కార మార్గం లభిస్తుందని భావిస్తున్నారు.

తెరపైకి దళారీ వ్యవస్థ..

మండల, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎక్కడైనా గొర్రెలు కొనుక్కోవచ్చని ఉపఎన్నిక సమయంలో సర్కారు చెప్పింది. ఇందుకోసం డీబీటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే ప్రభుత్వం వెళ్తోంది. మండల కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులను వెంట పెట్టుకొని, ప్రభుత్వం చెప్పిన ప్రాంతాల్లోనే గొర్రెలు కొనాలని కండీషన్ పెడుతోంది. దీంతో ప్రస్తుతం మునుగోడు లబ్ధిదారులు అనంతపూర్ జిల్లాలో గొర్రెలు కొనాల్సి వస్తోంది. అక్కడ గొర్రెలు కొనేందుకు మళ్లీ దళారీ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. గతంలో గొర్రెలు కొని, వాటిని తిరిగి రీస్లైకింగ్ ద్వారా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇంకొన్ని గొర్రెలు రోగాల బారినపడి చనిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిని అవలంబిస్తున్నారని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మునుగోడు గొర్రెల వ్యవహారంలో ఏదో గోల్ మాల్ జరగుతోందన్న సందేహంతోనే గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సెలవులో వెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు 300మంది అకౌంట్లలో పడ్డ రూ.3కోట్ల డబ్బుల గోల్ మాల్ వెనక ఎవరి ప్రమేయం తెలుసుకునేందుకు అధికారులు కిందా మీదా పడుతున్నారు.

కొనుగోళ్లలో కమీషన్లు రూ.43వేలు..!

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కోసం  రూ.1.58లక్షలు చెల్లిస్తోంది. దీంట్లో ఒక్క పొట్టేలుకు రూ.10వేలు కాగా, 20 గొర్రెలకు రూ.7,400 చొప్పున రూ.1. 48వేలు. కానీ ప్రస్తుతం గొర్రెలు అమ్మిన రైతులకు అధికారులు కేవలం రూ.లక్షా 15వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. బ్యాలెన్స్ రూ.43 వేలు దళారులు, అధికారుల చేతుల్లోకి పోతున్నాయని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తక్కువ రేటుకు గొర్రెలు కొనుగోలు చేసి, మిగిలిన డబ్బులను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాజేస్తున్నారని చెబుతున్నారు. రూల్స్ ప్రకారం గొర్రెలు కొనేందుకు డాక్టర్లు, లబ్ధిదారులతో పాటు తహసీల్దార్, ఎంపీడీవోలు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అనంతపూర్​కు డాక్టర్లు, లబ్ధిదారులు మాత్రమే వెళ్తున్నారు. అక్కడి నుంచి మునుగోడుకు వచ్చిన గొర్రెలను దిగుమతి చేసుకునే టైంలో మాత్రమే మండల కమిటీ పరిశీలన చేస్తుంది. దీంతో అసలు గొర్రెల కొనుగోళ్లలో వ్యవహారం అయోమయంగా మారిందని చెబుతున్నారు. అదీగాక అనంతపూర్​లో గొర్రెలు సరిపడా లేవని, ఇప్పటివరకు 50 మందికి మాత్రమే గొర్రెలు కొనిచ్చామని అధికారులు చెప్తున్నారు. ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో వారం, పది రోజులకు మించి గొర్రెలు కొనడం కష్టమని అంటున్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *