సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ, బండి సంజయ్ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (KCR) నేడు 69వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొంటున్నారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రక్తదానం, అన్నదానం, వస్త్రదానం, పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు

ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, గోల్డ్‌కోస్ట్‌, బెండీగో నగరాల్లో బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను గురువారం నిర్వహించారు. అక్కడి ఆలయాల్లో సీఎం కేసీఆర్‌ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం, వస్త్రదానం, మొక్కలు నాటడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు వినయ్‌, సన్నీగౌడ్‌, సాయిరాం, విశ్వామిత్ర, సతీష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా దక్షిణాఫిక్రాలోని 3 రాష్ట్రాల్లో నిత్యావసర సరకులు, అనాథ ఆశ్రమాల్లో ఆహారం పంపిణీ చేస్తున్నామని అక్కడి బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *