భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది జరగబోయే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మార్చి 22 ఉగాది నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణమహోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 30న సీతారాముల కళ్యాణం, మార్చి 31న పుష్కర పట్టాభిషేకం జరుగనున్నాయి.
ప్రతి ఏటా శ్రీరామనవమి స్వామి వారి కళ్యాణం అనంతరం మరుసటి రోజున భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేకం నిర్వహించడంభద్రాద్రి దేవస్థానంలో ఆనవాయితీగా వస్తున్న అంశం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర పట్టాభిషేకంగా ఈ క్రతువులు నిర్వహిస్తారు.
ఈ క్రమంలో ఏడాది జరగబోయే పట్టాభిషేకం పుష్కర పట్టాభిషేకం. కావున ఈ పుష్కర పట్టాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హోమం నిర్వహించేందుకు దేవస్థానం ఆలయ ప్రాంగణంలో తూర్పు మెట్ల వైపు తాత్కాలిక యాగశాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తాత్కాలిక యాగశాల నిర్మాణపు భూమి పూజ కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇదిలా ఉండగాభదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు వంసతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి సనవాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 30న మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు.
మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు సుమారు రూ.2.50 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.1.24 కోట్లతో దేవస్థానం ఇంజనీరింగు విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 21న పాల్వంచలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నవమి ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష సమావేశాన్ని కలెక్టరు అనుదీప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక పనులు ప్రారంభంలో భాగంగా గురువారం యాగశాల పనులకు రామాలయ ప్రాంగణంలో శ్రీకారం చుట్టనున్నారు. గతంలో నవమిని భక్తులు వీక్షించేందుకు 60 టీవీలను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసేవారు. అయితే ఈసారి 35 ఎల్ఎస్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.