జిల్లా వ్యాప్తంగా ఇవాళ కొన్ని కిరాతకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. బావకి అండగా నిలవాల్సిన బావమరిదే బావను హతమార్చాడు. చిన్న కారణానికే ఆగ్రహం తెచ్చుకున్న బావమరిది బావ పాలిట యముడయ్యాడు. అతి దారుణంగా బావని కట్టెతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన గురువారం మన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.కడప జిల్లాలోని కమలాపురం మండల పరిధిలో రామచంద్రాపురంలో బావమరిది రమణ చేతిలో బావ బాబు అనే వ్యక్తి కిరాతకంగా చంపబడ్డాడు. దీనికి కారణం సెల్ ఫోన్ పోయిందని బావ తిడుతుండగా.. బావ మాటలతో కోపోద్రిక్తుడైన బావమరిది రమణ… కట్టెతో బావ బాబుపై దారుణంగా దాడి చేసి గాయ పరిచాడు. ఇలా గాయపడిన బాబుని కమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని సమాచారం. దీనితో రామచంద్రాపురంలో విషాదఛాయలూ అలముకున్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడ్డ బావమరిది రమణ పోలీసుల అదుపులో వున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
జిల్లాలో మరొక సంఘటన దారుణమైన సంఘటన గురువారంఉదయం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి అప్పుడే నూరేళ్లు నిండాయి. స్కూల్ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు పాపని అనంత లోకాలకి తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళితే.పెండ్లిమర్రి మండలంలోని మిట్టమీదపల్లి, మెయిళ్ల కాల్వ మార్గమధ్యంలో వెళుతున్న సత్య సాయి స్కూల్ వ్యాన్ రోడ్ పై వున్న పాపని ఢీకొట్టిన ఘటన జరిగింది. స్కూల్ బస్సు ఢీ కొనడంతో పాప అక్కడికక్కడే మరణించగా స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పెండ్లిమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాప ఇలా విగతజీవిగా రోడ్ పై పడి వుండటం చూసి పాపతల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలముకున్నాయి.