రైల్వేలో ఉద్యోగం అంటే యువత ఎగిరి గంతేస్తారు. రైల్వేలో కొలువు సాధించడమే లక్ష్యంగా దేశ వ్యప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధం అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో కానిస్టేబుల్స్, సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలకు సంబంధించి మొత్తం 9000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచారం మొదలైన నాటి నుంచి యువత నిత్యం రైల్వేశాఖను సంప్రదిస్తున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలపాలంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ నుంచి ఈ నియామకాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 9000 కానిస్టేబుల్స్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం అవుతోందని అధికారులు స్పష్టం చేశారు. RPF లేదా రైల్వే మంత్రిత్వ శాఖ వారి అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ఏదైనా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అటువంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి కల్పిత వార్తలను చూసి అయోమయానికి గురికావద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సోషల్ మీడియా వినియోగం పెరిగిన నాటి నుంచి తప్పుడు వార్తల ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అనేక మంది తప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లను రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది నిజమే అనుకుని అనేక మంది వాటిని షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. తద్వారా నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. అయితే.. ఇలాంటి నోటిఫికేషన్లు ఎక్కడైనా సోషల్ మీడియాలో కనిపిస్తే అందుకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి నిర్ధారణ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.