నక్సలైట్ ఉద్యమంలో చేరి ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవుల్లో తిరిగిన యువతి.. పోలీసుల సాయంతో తర్వాత జనజీవన స్రవంతిలో చేరారు. అనంతరం తన బాటను మార్చుకుని, చదువుపై దృష్టి సారించారు. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన ఆమె.. భవిష్యత్తులో పోలీస్ కావడమే తన లక్ష్యమని అంటోంది. ఆమే మహారాష్ట్రలోని గోందియా జిల్లా కుర్‌ఖేడా తహశీల్‌కు చెందిన లావ్‌హరి గ్రామ గిరిజన యువతి రాజుల రావెల్సింగ్ హిదామి (19). ఇటీవల వెలువడిన మహారాష్ట్ర 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో హిదామీ 45.83 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆమెను గోందియా ఎస్పీ నిఖిల్ పింగలే శనివారం హిదామీని సత్కరించారు.
తనను నక్సలైట్లు ఎత్తుకెళ్లి, బలవంతంగా ఉద్యమంలో చేర్చుకున్నట్టు హిదామీ వెల్లడించారు. స్థానిక పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం… దాదాపు ఆరేళ్ల కిందట ప్రాంతంలో తన గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న హిదామీని నక్సల్స్ అపహరించారు. అనంతరం ఆమెను బలవంతంగా కుర్‌ఖేడా దళంలో చేర్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సాయుధ శిక్షణ తీసుకున్న రావెల్సింగ్.. పోలీసులపై జరిగిన ఓ హింసాత్మక దాడిలో పాల్గొన్నారు. అయితే, తాను దళం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్టు పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో రెండేళ్ల తర్వాత 2018లో దళం నుంచి బయటకు వచ్చిన హిదామీ.. పోలీసుల సాయంతో అప్పటి గోందియా అదనపు ఎస్పీ సందీప్ అథోల్ ఎదుట లొంగిపోయింది. చిన్న వయసు కావడంతో ఆమె సంరక్షకుడి బాధ్యతలను కూడా పోలీస్ అధికారి తీసుకున్నారు. ఏఎస్పీ, గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ ఆఫీసర్ జితేంద్ర చుధారీ సూచన మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరింది. నక్సల్స్ అపహరించడానికి ముందు ఏడో తరగతి వరకూ చదువుకున్న రాజులు.. తిరిగి తన చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. కొంత మంది పోలీసులు వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గలేదు. 2021లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్‌లో చేరింది.
ఇప్పడు ఇంటర్ పూర్తిచేసిన రాజులు.. డిగ్రీలో చేరుతానని, తర్వాత పోలీస్ అవుతానని అంటోంది. విద్య యొక్క ప్రాధాన్యతను గ్రహించిన ఆమె.. హింసను విడిచిపెట్టి, ప్రధాన స్రవంతిలో చేరడానికి తనలాంటి మరి కొందరికి ప్రేరణగా నిలిచారు.
Read More Latest National News And Telugu News