Minister Dayakar Rao | పల్లె పల్లెనా దశాబ్ది వేడుకలు పండుగలా నిర్వహించాలి : మంత్రి ఎర్రబెల్లి

Minister Dayakar Rao | హనుమకొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పల్లె పల్లెనా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి వరంగల్‌, హన్మకొండ జిల్లాల అధికారులతో హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజుల పాటు రాష్ట్రం సాధించిన విజయాలను ప్రజలకు తెలిపేలా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ధి ఉత్సవాలు ప‌ల్లెప‌ల్లెనా జ‌ర‌గాల‌ని, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికాబ‌ద్ధంగా కార్యక్రమాల‌ను ఏర్పాటు చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

గ్రామ గ్రామాన గ్రామ స‌భ‌లు పెట్టాల‌ని, ఆయా గ్రామ స‌భ‌ల సంద‌ర్భంగా ప్రగ‌తి నివేదిక‌లు చ‌దివి ప్రజ‌ల‌కు వినిపించాల‌న్నారు. గ్రామంలో ఇప్పటి వ‌ర‌కు ఈ ప‌దేండ్లలో జ‌రిగిన అభివృద్ధిని, సాధించిన అభివృద్ధి విజయాల‌ను ప్రజ‌లు తెలిపేలా ప్రదర్శన‌లు జ‌ర‌గాల‌ని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటి ముందు 10 ఏండ్ల విజ‌యోత్సవాలు ఉట్టిప‌డేలా… రంగు రంగుల రంగ‌వ‌ల్లుల‌ను తీర్చిదిద్దాల‌ని, అలా మ‌హిళ‌ల‌ను సిద్ధం చేయాల‌ని మంత్రి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత మ‌హిళ‌ల‌కు, మ‌హిళా సంఘాల‌కు ఎక్కడాలేని గుర్తింపు, గౌర‌వం ద‌క్కింద‌ని మంత్రి తెలిపారు. స్వయం స‌హాయ‌క‌ సంఘాల మహిళ‌ల‌ను పారిశ్రామికవేత్తలుగా త‌యారు చేస్తున్నద‌ని, ఇందుకు వారికి రుణాలు అంద‌చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు.

ఫ్లిక్ కార్ట్ వంటి అంత‌ర్జాతీయ‌ సంస్థల‌తో ఒప్పందాలు చేసుకుని, మార్కెటింగ్ స‌దుపాయం క‌ల్పించామ‌ని మంత్రి అన్నారు. మ‌హిళా సంఘాలు చేస్తున్న ఉత్పత్తుల‌ను ప్రద‌ర్శించ‌డం ద్వారా ఆయా ఉత్పత్తుల‌కు మంచి ఆద‌ర‌ణ క‌ల్పించాల‌ని మంత్రి అధికారుల‌కు చెప్పారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్బవించిందని, వారి త్యాగాల‌ను స్మరించుకుంటూ అమ‌ర వీరుల స్థూపాలున్న చోట‌.. వాటికి, లేని చొట కొత్తగా ఏర్పాటు చేసి, అమ‌రవీరుల‌కు ఘనంగా నివాళులర్పించాలన్నారు.

తెలంగాణ‌కు ముందు, త‌ర్వాత జ‌రిగిన అభివృద్ధిపై నివేదిక‌లు సిద్ధం చేయాలన్నారు. గ‌తంలో ప‌ల్లెలు ఎట్లుండే.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? తెలిసేలా ఫోటో ఎగ్జిబిష‌న్‌లు నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మా రెడ్డి, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేశ్‌, నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, సీపీ రంగనాథ్, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా ప‌ట్నాయ‌క్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *