TS Ministers | తెలంగాణ సమాజానికి సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలు మరువలేనివి : మంత్రులు

కవాడిగూడ (హైదరాబాద్‌ ) : స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక చరిత్రకారులు, కవి, రచయిత, సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి(Suravaram Prathapareddy) తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌రెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి 127వ జయంతి సందర్భంగా ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో భాషా, సాంస్కృతిక, సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించడంలో సురవరం ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

వారు అందించిన సేవలను భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పేలా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని వివరించారు . తెలుగు భాష(Telugu Language), సంస్కృతుల(Culturer) వికాసానికి ఎనలేని కృషి చేసిన సురవరం రచనలను భవిష్యత్‌ తరాలకు అందించవలసిన అవసరం ఉందన్నారు.

ఆ మహనీయుని ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య, కార్యదర్శి సురవరం పుష్పలత రెడ్డి, కోశాధికారి డాక్టర్‌ సురవరం కృష్ణవర్ధన్‌ రెడ్డి, ట్రస్ట్‌ సభ్యులు సురవరం విష్ణువర్ధన్‌ రెడ్డి, సురవరం అనిల్‌ కుమార్‌ రెడ్డి, సురవరం కపిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *