Vinod Kumar | అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

Vinod Kumar | కరీంనగర్‌ కార్పొరేషన్‌, మే 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల, వృత్తిదారుల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో హాకర్స్‌ అసోసియేషన్‌, పూసల కుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా మైనార్టీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు.

సమైక్య పాలకులు తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, సాగునీరు అందదని విమర్శించారని, కానీ ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. అలాగే, వ్యవసాయానికి సాగునీరు అందించడంతోపాటు 24 గంటల కరెంటు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసినట్లు చెప్పారు.

మండుటెండల్లో కూడా చెరువులు మత్తుళ్లు దుంకుతున్నాయంటే అది సీఎం కేసీఆర్‌ ఘనతే అని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓవైపు అభివృద్ధితోపాటు మరోవైపు అన్ని వర్గాల, మతాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్న ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు అతి త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

పూసల కులాన్ని ఎంబీసీలో చేర్చేందుకు కృషి చేస్తామని బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వెనుకబడిన తరగతుల కులాల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా అన్ని కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు తెచ్చారన్నారు. మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే 200లకు పైగా మైనార్టీ గురుకులాలను ప్రారంభించి కార్పొరేట్‌కు దీటైన విద్యను అందిస్తున్నామన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచితంగా శిక్షణను అందించి మెరుగైన పలితాలను సాధిస్తుందన్నారు. ఈ సమావేశాల్లో నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ నాయకులు సంపత్‌గౌడ్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *