Wrestlers Protest | రెజ్ల‌ర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు

Wrestlers Protest | కొత్తగా ప్రారంభించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం వైపు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించిన రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ‌టంతోపాటు చ‌ట్ట విరుద్ధ స‌మావేశాలు నిర్వ‌హించార‌ని, ప్ర‌భుత్వోద్యోగుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసులు న‌మోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు.

రెజ్ల‌ర్ల నిర‌స‌న ప్రాంతం నుంచి కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం వ‌ర‌కు రెజ‌ర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా తదితరులు ప్ర‌ద‌ర్శ‌న‌గా బ‌య‌లుదేరారు. మ‌హిళా అసెంబ్లీ నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌తో వెళ్లిన రెజ్ల‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివ‌ర‌కు రెజ్ల‌ర్ల‌ను బ‌లవంతంగా బ‌స్సుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. తాజాగా వారిపై కేసులు న‌మోదు చేశారు.

లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రెజ్ల‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆందోళ‌న‌లో భాగంగా ఆదివారం మహిళా సమ్మాన్‌ మహా పంచాయత్‌ నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు పార్లమెంట్‌ భవనానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ప‌టిష్ట‌ భద్రత ఏర్పాటు చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

అయితే, పోలీసులు భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించినా రెజ్ల‌ర్లు జాతీయ ప‌తాకాల‌తో పార్ల‌మెంట్‌కు మార్చ్ ప్రారంభించారు. వారిని మ‌ధ్య‌లోనే పోలీసులు అడ్డుకున్నా వినేష్‌ ఫొగాట్‌, సంగీతా ఫొగాట్‌ తదితరులు బారికేడ్లను తొలగించి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. రెజ్ల‌ర్ల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట‌లో ప‌లువురు అథ్లెట్లు కింద ప‌డిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *