ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. బలమైన సందేశం పంపిన ఖాళీ కుర్చీ!

యావత్తు భారతావని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేత ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం వేసిన కుర్చీ ఖాళీగా ఉంది. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేకపోయినట్టు ఖర్గే వివరణ ఇచ్చారు.

ట్విట్టర్‌లో ఓ వీడియో సందేశం ఉంచిన ఆయన.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలాజా అబుల్ కలామ్ ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహాత్ములకు నివాళులర్పించారు.

అలాగే, దేశ ప్రగతిలో స్వాతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిల పాత్రను కొనియాడారు. ‘ప్రతి ప్రధానమంత్రి దేశ ప్రగతికి దోహదపడ్డారు.. గత కొన్నేళ్లలో భారత్ పురోగమిస్తుందని ఈ రోజు కొందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు’ అని మోదీపై పరోక్షంగా కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు.

‘అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధానమంత్రిలందరూ దేశం గురించి ఆలోచించారు.. అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని నేను బాధగా చెబుతున్నాను.. ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారుల దాడులే కాదు, ఎన్నికల కమిషన్‌ను కూడా నిర్వీర్యం చేస్తున్నారు.. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు, మైక్‌లు కట్ చేస్తున్నారు.. ప్రసంగాలు తొలగిస్తున్నారు…’ అని ఆరోపించారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎయిమ్స్, అంతరిక్ష పరిశోధనల సృష్టి నెహ్రూ హయాంలోనే జరిగాయి.. స్వతంత్ర భారతదేశంలో కళ, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రోత్సహించారని ఆయన అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ విధానాలు ప్రధాని మోదీ కీలక మంత్రాలలో ఒకటైన ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి)గా మారడానికి దోహదపడ్డాయని ఖర్గే అన్నారు.

‘మహానాయకులు కొత్త చరిత్ర సృష్టించడానికి గత చరిత్రను చెరిపివేయరు.. వీళ్లు మాత్రం ప్రతిదానికీ పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.. గత పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరు మార్చేస్తూ.. తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారు.. ఇప్పుడు దేశంలో శాంతిని నెలకొల్పిన పాత చట్టాల పేర్లను మారుస్తున్నారు..తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి మొదట ‘అచ్ఛే దిన్’ అన్నారు.. తర్వాత కొత్త భారతం.. ఇప్పుడు అమృత్ కాల్ అని పేర్లు మార్చుకోవడం లేదా?’ అని ప్రశ్నించారు.

Read More Latest National News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *