గద్దర్ కోట్లు సంపాదించారా?.. ఆస్తుల వివరాలు చెప్పిన కొడుకు సూర్యం

Gaddar Assets: ప్రజా కవి, గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం పాలైన ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈనెల 6న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. గద్దర్ మరణం తర్వాత ఆయన ఆస్తులకు సంపాదించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గద్దర్ ఉద్యమంలో పని చేసి కోట్లు సంపాదించారని కొందరు ప్రచారం చేశారు. అయితే ఆ వార్తలపై ఆయన కుమారుడు సూర్యం వివరణ ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్యం తన తండ్రి సంపాదించిన ఆస్తులు, తాము చిన్నతనం నుంచి జీవించిన జీవతం గురించి చెప్పారు. సూర్యం వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

“మా నాన్న కోట్లు సంపాదించారని అంటున్నారు. అదంతా అవాస్తం. మేం చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పెరిగాం. మా చదువులు లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో పూర్తయ్యాయని ప్రచారం చేస్తున్నారు. మేం చదివింది. హిమాయత్ నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్ స్కూల్. అది నాన్న గారి మిత్రుడైన నర్సింగరావు గారి బ్రదర్ వేద కుమార్ గారి పాఠశాల. ఇంటర్ లయోల కాలేజీలో చదివా. ఏపీలోని పలు ప్రాంతాల్లో డబ్బు కోసం మార్కెటింగ్ పని చేశాను.

తమ్ముడు, చెల్లి సినీ నటుడు మోహన్ బాబు గారి హాస్టల్‌లో ఇంటర్ చదివారు. నాన్న గారికి మోహన్ బాబు గారు ఆప్తులు. ఆయన చేర్పించమంటేనే తమ్మడు, చెల్లిని మోహన్ బాబు గారి హాస్టల్‌లో చేర్పించారు. అమ్మ సనత్ నగర్‌లోని మీటర్ ప్యాక్టరీలో లేబర్‌గా పని చేసేది. మేం హాస్టల్‌లో ఉన్న సమయంలో నాన్నతోనే అమ్మ ప్రయాణం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. ఇప్పుడున్న ఇల్లు కూడా మా పాత ఇల్లు అమ్మి, అమ్మకు వచ్చిన పెన్షన్ ద్వారా కట్టిందే. ఆ ఇల్లు అమ్మ కష్టార్జితం. నాన్న సంపాదించింది కాదు. మాకు ఆస్తులు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుంతోంది. అశాస్త్రీయమైన వార్తలు పట్టించుకోవద్దని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.

మాకు ఇన్నోవా వెహికల్ ఉంది. దాన్ని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి గారు నాన్న గారికి ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ట్యాక్సీల్లో నాన్న గారు వెళ్తుంటే చూడలేక ఆ బండిని ఇచ్చారు. అది మేం షికార్లు చేయటానికి కొనలేదు. మా నాన్న ప్రజల కోసం తన ఉద్యోగాన్ని, తల్లి, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలి పెట్టి తిరిగారు. ఇంటి బాధ్యతలు అంతా మా అమ్మే చూసుకుంది. మేం జీవితంలో చాలా కష్టపడ్డాం. మాకు కోట్లు లేవు. అదంతా అవాస్తవం.” అని సూర్యం వెల్లడించారు.

Read More Telangana News And

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *