తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్ లో చిరుత పులి సోమవారంనాడు రాత్రి కలకలం సృష్టించింది. చిరుత పులిని చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులు గుర్తించారు. అయితే నిన్ననే ఓ చిరుతను బోనులో బంధించారు. అయితే ఇవాళ సాయంత్రం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లోకి చిరుత రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
శేషాచలం అడవుల్లో నుండి చిరుతలు తిరుపతిలోకి అడుగు పెట్టాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవాళ ఉదయం వేదిక్ యూనివర్శిటీ వద్ద చిరుత సంచరించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అలిపిరి, ఎస్వీ యూనివర్శిటీ, జూపార్క్ రోడ్డు ప్రాంతాల్లో సంచరించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు. రాత్రిపూట ప్రయాణం చేసే వారంతా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ చిరుతపులిని పట్టుకొనేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆహారం, నీటి కోసం చిరుత పులులు జనారణ్యంలోకి వస్తున్నట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు.