మరీ ఇంత దారుణమా..? 50 కుటుంబాల సామాజిక బహిష్కరణ.. మితి మీరిన వీడీసీ ఆగడాలు..

గ్రామాభివృద్ది కోసం పాటుపాడాల్సిన‌ గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. వారి మాట‌కు అడ్డు చెబితే చాలు సామాజికంగా బ‌హిష్క‌రిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎవ‌రు స‌హాక‌రించరు. చివ‌ర‌కు పాలు, నీళ్లు, నిత్య‌వ‌స‌ర సరుకులు, బ‌ర్రేలు, గోర్రెల‌ను కూడా మంద‌లోకి రానివ్వ‌రు. దీంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. తాజాగా ఓ గ్రామంలో 50 కుటుంబాల‌ను సామాజిక బ‌హిష్క‌ర‌ణ చేసారు.బాధితకుటుంబాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామనికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయడంతో అవస్థలకు గురవుతున్నారు. కోమన్ పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్ గ్రామానికి చెందిన ఎమ్ ఎన్ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది. అయితే కెనాల్ పక్కన నుండి మరో 30 గుంటల స్థలం కూడా అతనికి సంబంధించినదే ఉంది.

20 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసిన భూమిని ఆ వ్యక్తి ఇటీవల 30 గుంటల స్థలానికి రెవెన్యూ సర్వే చేపట్టి పంచనామా చేస్తే సంబంధిత భూమికి పంచులుగా కోమన్ పల్లి గ్రామానికి చెందిన గుజ్జ అశోక్ యాదవ్, నిమ్మ పోషెట్టీ ( నాయక పొడు) సంతకాలు పెట్టారు. వీరిద్దరే కాకుండా సుబ్బిర్యాల్ గ్రామస్తులు ఎనిమిది మంది కూడా పంచులుగా సంతకాలు పెట్టారు. కోమన్ పల్లిగ్రామస్తులు ఇద్దరు సంతకాలు పెట్టడం వల్లే 30 గుంటల స్థలం గంగారెడ్డికి దక్కిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇరువురిపై ఆరోపణలు చేశారు.

రెండు రోజుల పాటు సమయం కావాలని బాధితులు అడిగినా అవేమీ పట్టించుకోకుండా లక్ష ఆరువేల రూపాయలు ఖర్చయిందని చెప్పి డబ్బులు ఇరువురు చెల్లించాలని హుకుం జారీ చేశారు.ఆర్మూర్ తాసిల్దార్, ఆర్ ఐ, ఏడి అధికారులు చెప్పారని, పంచులుగా సంతకం పెట్టినందుకేజరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. జరిమానాగా విధించిన డబ్బులు చెల్లించాలని విడిసి డిమాండ్ చేశారు. ఈ నెల ఆగ‌స్టు 7వ తేదీన బాదితులు ఆర్మూర్ సీఐకి ఫిర్యాదు చేసారు. ఆగ‌స్టు 8వ తేదీన సీఐ వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపి వెళ్లారు.గ్రామ విడీసీని కాదని పోలీసులను ఎందుకు పిలిపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే రోజు నుండి గొల్ల కురుమ 28 కుటుంబాలు, నాయకపోడు 22 కుటుంబాలను సాంఘిక కుల బహిష్కరణ చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిలు.. ఫెయిలైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ట్విస్ట్ ఏంటంటే..?

రెండు కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు గురి చేస్తూ నిత్యవసర సరుకులు, హోటల్లో టీ, టిఫిన్, ఫిల్టర్ వాటర్, డిష్ టీవీ కనెక్షన్, ఆర్ఎంపి వైద్యుడి సేవలు, బీడీ కార్మికులకు ఆకులు, బీడీలను తీసుకోవడం లేదని వారు వాపోయారు. చివరకు బర్రెలు, గొర్రెలను కూడా మందలో కలువనియడం లేదని బాదితులు చెబుతున్నారు. రెండు కుటుంబాలను దుర్భాషలాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సర్వేకి పంచులుగా ఉండి సంతకాలు పెట్టడమే మా తప్ప అంటూ ప్రశ్నించారు. రెండు కుల కుటుంబాల సమస్యను పరిష్కరించి సంబంధిత అధికారులు, పోలీసులు సరైన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.గొల్ల కురుమ‌, నాయ‌క పొడు కుటుంబాల‌కు జిల్లా యాద‌వ సంఘం నాయ‌కురాలు మంజుల వారికి మ‌ద్ద‌తుగా నిలిచారు. 50 కుటుంబాలను వేలివేయడం దారుణ‌మైన చ‌ర్య అన్నారు. ఇప్ప‌టికైన గ్రామాభివృద్ది క‌మిటి త‌న త‌ప్పును స‌రిచేసుకోవాల‌ని ఆమె కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *