తినడానికి మూడు రొట్టెలు ఉన్నప్పుడు, తినవలసినవారు నలుగురు అయినప్పుడు ‘నాకు ఆకలి లేదు’ అనే వ్యక్తి మహిళ. ఇంట్లో ఎవరికి అనారోగ్యం కలిగినా.. ముందుండి సేవలు చేస్తుందామె. తన దగ్గరికి వచ్చేసరికి ఎవరికీ బరువు కాకూడదని అనుకుంటుంది. తనను ఇబ్బంది పెడుతున్న రుగ్మతల గురించి కూడా ఓ పట్టాన బయటపెట్టదు. అచితా జాకబ్ ఓ కూతురిగా, చెల్లిగా అలాంటి సంఘటనలు అనేకం చూసింది. అందరికీ అన్నీ తానై నిలిచే స్త్రీ.. తనలోని సహజ త్యాగగుణం కారణంగా ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి రాకూడదనే.. బెంగళూరు కేంద్రంగా ‘ప్రొయాక్టివ్ ఫర్ హర్’ అనే స్టార్టప్‌ను స్థాపించింది. మహిళల కోసం, మహిళలే స్థాపించిన మహిళా వైద్యుల బృందం ఇది. మిగతా హాస్పిటల్స్‌లా కాకుండా.. ఇక్కడ రోగి నుంచి సమాచారం రాబట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.
ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఆ మహిళ మనసు విప్పి మాట్లాడటానికి వీలు ఉంటుంది. ఫెర్టిలిటీ, డెర్మటాలజీ, న్యూట్రిషన్ తదితర అంశాలకు సంబంధించి అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తుంది.. ప్రొయాక్టివ్ ఫర్ హర్. తన సేవల్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నం ప్రారంభించారు అచిత. ఆ చొరవకు గుర్తింపుగా.. వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి ఐదున్నర మిలియన్ డాలర్ల పెట్టుబడులూ సమకూరాయి. అచిత స్వతహాగా మార్కెటింగ్ నిపుణురాలు. గతంలో ‘డా విటా’ అనే ఫార్చ్యూన్ 500 కిడ్నీ కేర్ కంపెనీకి మార్కెటింగ్ లీడ్‌గా పనిచేసింది. సామా జిక స్పృహ, మార్కెటింగ్ నైపుణ్యం, వైద్య పరిజ్ఞానం.. ఈ మూడూ తనలో పుష్కలం. ఆమె విజయ రహస్యం కూడా ఇదే.