కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని నడిచి వెళ్తోన్న వ్యక్తిపై దుండుగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితులు.. దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడగా.. కుమార్తెకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గతవారం బీజేపీ నేతను దుండుగులు కాల్చిచంపిన నాలుగు రోజుల్లోనే ఇది జరగడం గమనార్హం. తాజా, ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. బాధితుడు ఇరుకైన సందులో నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా… ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి తుపాకీని తీసి సమీపం నుంచి కాల్పలు జరిపాడు. బాధితుడు వెంటనే నేలపై కుప్పకూలిపోగా.. అతడి భుజాలపై కుమార్తె కిందపడిపోయింది.. దాడి చేసిన వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోవడం అందులో రికార్డయ్యింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడ్ని మహ్మద్ షోయబ్‌గా (30) గుర్తించారు. అతడు షాజహాన్‌పూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గుఫ్రాన్, నదీమ్ అనే ఇద్దరు వ్యక్తులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, మూడో నిందితుడు తారిఖ్ కోసం గాలిస్తున్నామని, ఇందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్టు సీనియర్ పోలీస్ అధికారి అశోక్ మీనా తెలిపారు. షోయబ్‌పై కాల్పులు జరిపిన నిందితులు అతడికి బంధువులేనని చెప్పారు.
ప్రధాన నిందితుడు తారిఖ్‌తో షోయబ్‌కు ఓ మహిళ విషయంలో గతంలో గొడవ జరిగినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. షోయబ్ వేరే ప్రాంతంలో ఉంటున్నాడని, కొత్వాలీ ప్రాంతంలోని తన పూర్వీకుల ఇంటిలో జరిగే ఓ కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వచ్చాడని అన్నారు.
Read More Latest Crime News And Telugu News