రూ.2 లక్షల నుంచి రూ.15లక్షలు.. తలసరి ఆదాయంపై ఎస్‌బీఐ కీలక రిపోర్ట్.. ఎప్పటి వరకంటే?

SBI: యావత్ భారతావని 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటోంది. అయితే 100వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం (Per capita Income) గణనీయంగా పెరగనుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. 2047 నాటికి తలసరి ఆదాయం దాదాపు రూ. 15 లక్షలకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయం 2022- 23 ఆర్థిక ఏడాదిలో రూ. 2 లక్షలు ఉండగా.. అంది 2047 నాటికి రూ. 14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే, 2047 నాటికి అంటే వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే నాటికి భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశం అనేది స్వప్నం కాకూడదని.. 140 కోట్ల మంది దేశ పౌరుల ప్రతిజ్ఞ కావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చి నివేదిక వెలువడడం గమనార్హం.

స్టేట్ బ్యాంక్ రీసెర్చి నివేదిక ప్రకారం.. దేశ ప్రజల తలసరి ఆదాయంతో పాటు మరికొన్ని గణాంకాలను వెల్లడించింది. 201- 22 ఆర్థిక ఏడాదిలో ట్యాక్స్ చెల్లింపుదారుల సగటు ఆదాయం రూ. 13 లక్షలుగా ఉండగా.. అది 2047 నాటికి ఆ మొత్తం రూ. 49.9 లక్షలకు పెరగనుందని స్టేట్ బ్యాంక్ రీసెర్చి ఆర్థిక వేత్తలు తెలిపారు. తక్కువ ఆదాయ వర్గాలు కాస్త అధికాదాయ వర్గాలుగా మారనున్నాయని పేర్కొన్నారు. ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య సైతం ప్రస్తుతం ఉన్న 8. 5 కోట్ల నుంచి 48. 2 కోట్లకు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక తెలిపింది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే శ్రామిక శక్తి 2022- 23 లో 22. 4 శాతంగా ఉంది. అది 2047 నాటికి 85. 3 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. జీరో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య మరో 25 శాతం మేర తగ్గనుందని అంచనా వేసింది. వందో స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారనుందని అంచనా వేసింది.

Read Latest

Business News and Telugu News

102651376

102707299

102596005

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *