కరెన్సీ మార్కెట్‌లో రూపాయి తేలిపోతున్నది.
అమెరికా డాలర్ ముందు భారతీయ రుపీ నేలచూపులు చూస్తున్నది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి పతనమైపోయింది.
నానాటికీ దిగజారుతున్న మారకం విలువ.. ఇప్పుడు యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థను, పరపతినే ప్రమాదంలో పడేసింది. ఈ చారిత్రక క్షీణత వెనుక అంతర్జాతీయ పరిస్థితుల కంటే.. దేశ పాలకుల్లో పేరుకుపోయిన అలసత్వమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
Rupee | ముంబై, ఆగస్టు 14: రూపాయి మారకం విలువ చారిత్రక స్థాయికి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్‌లో గత కొంత కాలంగా అగ్రరాజ్య కరెన్సీ ముందు వెలవెలబోతున్న భారతీయ కరెన్సీ.. సోమవారం ట్రేడింగ్‌లో మునుపెన్నడూ లేనివిధంగా దిగజారింది. ఏకంగా 83 మార్కును దాటి 83.08 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 83.11 వద్దకు పడిపోవడం గమనార్హం. నిజానికి ఉదయం ఆరంభం నుంచే రూపాయికి ఆదరణ కరువైపోయింది. ఈ నేపథ్యంలోనే 25-29 పైసల నష్టాల్లో కదలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి 26 పైసలు కోల్పోయింది. శుక్రవారం 16 పైసలు పడిపోయిన విషయం తెలిసిందే.
డాలర్లకు డిమాండ్
దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్ కూడా రూపాయి మారకం ఉసురును తీసేసిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే దేశం నుంచి తరలిపోతున్న విదేశీ నిధులు సైతం నష్టాల తీవ్రతను మరింత పెంచాయని చెప్తున్నారు. అలాగే గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా రుపీని ఒత్తిడిలోకి నెడుతున్నాయని పేర్కొంటున్నారు.
మోదీ హయాంలో 25 ఔట్
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి రూపాయి మారకం విలువ భారీగానే ఆవిరైపోయింది. గడిచిన ఈ 9 ఏండ్లలో దాదాపు 25 రూపాయలు క్షీణించడం గమనార్హం. 2014లో మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టే సమయంలో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 58 వద్ద ఉన్నది. ఇప్పుడు 83 దగ్గర ఉండటంతో 25 రూపాయలు పతనమైనైట్టెంది. ఈ భారం మొత్తం దేశంలోని ప్రతీ వస్తూత్పత్తిపై పడిందని, అది ద్రవ్యోల్బణానికి దారితీసిందని, వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యతను కఠినతరం చేసిందని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే.. భారతీయ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం తప్పదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.