Tirumala Leopard Incident: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను లక్షిత కుటుంబం తిరస్కరించింది. ఎక్స్‌గ్రేషియా తీసుకోవడం వల్ల తమ పాప తిరిగి రాదు కదా? అని ప్రశ్నించింది. ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేయి దులుపుకోవాలని టీటీడీ చూస్తోందని, తమకు అవసరం లేదని లక్షిత తాత వెల్లడించారు. తమ బ్రతుకు తాము బ్రతుకుతామని, అవసరమైతే కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తామని తెలిపారు. టీటీడీ ఇచ్చే సొమ్ము తమకు అవసరం లేదని, ఇచ్చినా తాము తీసుకోమని చెప్పారు. లక్షిత చనిపోవడానికి తల్లిదండ్రులే కారణమని వచ్చిన ఆరోపణలపై లక్షిత తాత మండిపడ్డారు.
తిరుమలలో గతంలో కూడా చిరుతల దాడి ఘటనలు జరిగాయని, తల్లిదండ్రులు ఎలా కారణం అవుతారని లక్షిత తాత ప్రశ్నించారు. భక్తుల భద్రతపై టీటీడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నడకదారిలో కంచె ఎందుకు వేయడం లేదని, కంచె వేయడం వల్ల భక్తులకు భద్రత ఉంటుందని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రతకే టీటీడీ ప్రాధాన్యం ఇస్తోందని, సామాన్య భక్తుల గురించి అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ కుటుంబానికి జరిగిన నష్టం ఎంపీలు, ఎమ్మెల్యేలకు జరిగితే ఊరుకుంటారా? అని నిలదీశారు. టీటీడీ ఇచ్చే ముష్టి సొమ్ము, భిక్ష తమకు అవసరం లేదంటూ లక్షిత తాత ఘాటుగా స్పందించారు.
100 మందిని గంపుగా పంపాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం, మధ్యాహ్నం 2 గంటల వరకు పిల్లలను నడకమార్గంలో అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై కూడా లక్షిత తాత మండిపడ్డారు. రోడ్డు మార్గంలో వెళితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, కేవలం డబ్బుల కోసమే టీటీడీ అలా ఆలోచిస్తుందని ఆరోపించారు. టీటీడీ దగ్గర నిధులన్నీ ప్రజల ద్వారా వచ్చినవేనని, అలాంటి సొమ్మును మళ్లీ మాకే భిక్ష వేస్తారా? అంటూ ప్రశ్నించారు.
కాగా తిరుమల అలిపిరి కాలి బాటలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన తండ్రి దినేష్ కుమార్, తల్లి శశికళ కుమార్తె లక్షిత సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో అదృశ్యమైంది. దీంతో పాప కోసం కుటుంబసభ్యులు కాసేపు వెతుకులాట చేపట్టారు. కానీ కనిపించకపోవడంతో తమ పాప తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాత్రి మొత్తం గాలింపు చర్యలు చేపట్టగా.. ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద మృతదేహాం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా.. చిరుత దాడిలో చనిపోయినట్లు తేలింది. ఈ ఘటనతో టీటీడీ అప్రమత్తమై నడకమార్గంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.