లక్నో: ఒక వ్యక్తి ఏడాదిన్నర కూతుర్ని భుజాలపై మోస్తూ రోడ్డుపై నడిచాడు. ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై అక్కడకు వచ్చారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతడి ముఖంపై కాల్పులు జరిపి పారిపోయారు (Man Carrying Daughter On His Shoulder, Shot At Point Blank Range). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బాబుజాయ్ ప్రాంతానికి చెందిన షోయబ్, ఆదివారం రాత్రి కుటుంబంతో కలిసి నడుస్తూ బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా కుమార్తెను తన భుజాలపై ఎత్తుకుని మోశాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు రెండు బైక్‌లపై ఆ ప్రాంతానికి వచ్చారు. బైక్ దిగిన ఒక వ్యక్తి షోయబ్ ముందుకు వెళ్లాడు. పాపను భుజంపై మోస్తున్న అతడి ముఖంపై దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, గన్ కాల్పుల్లో గాయపడిన షోయబ్ రోడ్డుపై పడిపోయాడు. ఇది చూసి వెనుక ఉన్న కుటుంబ సభ్యులు పరుగున అతడి వద్దకు చేరుకున్నారు. దూరంగా పడిన పాపకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊరట చెందారు. షోయబ్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి అక్కడి నుంచి బరేలీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోకి ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ సంఘటనపై షోయబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తారిఖ్ అనే వ్యక్తిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. షోయబ్ భార్య చాందినికి తొలుత తారిఖ్ సోదరుడితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలిపారు. కొన్ని కారణాల వల్ల తారిఖ్ సోదరుడితో వివాహం రద్దైందని, ఆ తర్వాత షోయబ్‌తో ఆమె పెళ్లి జరిగిందని చెప్పారు. దీనిపై కక్ష గట్టిన తారిఖ్ తన అనుచరులతో కలిసి షోయబ్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. 15 ఏండ్లుగా పంజాబ్‌లో ఉన్న షోయబ్ ఒక వేడుకలో పాల్గొనేందుకు రెండు రోజుల కిందట కుటుంబంతో కలిసి సొంతూరు వచ్చినట్లు వెల్లడించారు.
కాగా, పోలీసులు తారిఖ్‌తోపాటు మరో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించినట్టు పోలీస్ అధికారి తెలిపారు. వారిని అరెస్ట్ చేసేందుకు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.