స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్ధుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ దంపతులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, పలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో వుండటంతో ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా వున్నారు. అటు ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన అతిథులను గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఒక్కొక్కరిగా పలకరించారు.
అంతకుముందు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పలువురు అధికారులు, వీఐపీలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, విద్యాశాఖ , వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల శకటాలను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమౌతున్నాయని సీఎం జగన్ వివరించారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పనులు పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
పెత్తందారి భావజాలంపై యుద్ధం చేస్తున్నామని ..పేదలు గెలిచేవరకు, వారి బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అంటరానితనంపై యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఆయన చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా అంటరానితనమేనని సీఎం పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆలయ బోర్డుల నుండి వ్యవసాయ కమిటీల వరకు అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తున్నట్టుగా సీఎం చెప్పారు.