కూర్పుపై కసరత్తు

  • ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత్‌ సిద్ధం
  • భారత్‌ మరో పొట్టి పోరుకు సమాయత్తమైంది. వెస్టిండీస్‌ చేతిలో అనూహ్య ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమ్‌ఇండియా..ఐర్లాండ్‌తో తలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్‌..కుర్రాళ్లతో కళకళలాడుతున్నది. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన కుర్రాళ్లు ఐర్లాండ్‌తో పోరులో ఏ మేరకు రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్‌ శాంసన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతుండగా, యువ వికెట్‌కీపర్‌ జితేశ్‌శర్మ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

    డబ్లిన్‌: భారత్‌, ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వేళయైంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. రానున్న ఆసియా గేమ్స్‌, ఆసియాకప్‌, స్వదేశం వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని సెలెక్షన్‌ కమిటీ ఐర్లాండ్‌తో సిరీస్‌కు కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు యువ క్రికెటర్లు తహతహలాడుతున్నారు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. ఆసియా కప్‌నకు ముందు బుమ్రాకు ఇది కీలకం కానుంది. ఫామ్‌లేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్న సీనియర్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మెడపై కత్తి వేలాడుతున్నది. విండీస్‌తో సిరీస్‌లో 12, 7, 13 పరుగులకే పరిమితమైన శాంసన్‌ బెర్తు దక్కించుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో ఆకట్టుకున్న జితేశ్‌శర్మ..శాంసన్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఒకవేళ ఇదే జరిగితే శాంసన్‌కు బదులుగా జితేశ్‌ తుదిజట్టులోకి రావచ్చు. రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా వ్యవహరించనున్నారు. విండీస్‌తో సిరీస్‌లో దుమ్మురేపిన హైదరాబాదీ తిలక్‌వర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐర్లాండ్‌తోనూ వర్మ రాణిస్తే..వన్డే ప్రపంచకప్‌లో అవకాశాలు మరింత మెరుగవచ్చు. సూర్యకుమార్‌ యాదవ్‌ గైర్హాజరీలో మిడిలార్డర్‌లో తిలక్‌ కీలకంగా వ్యవహరించనున్నాడు. హార్డ్‌హిట్టర్‌ శివమ్‌ దూబేకు తుది జట్టులో కచ్చితంగా చోటు దక్కనుంది. బౌలింగ్‌ విషయానికొస్తే బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముఖేశ్‌కుమార్‌, అవేశ్‌ఖాన్‌, రవి బిష్ణోయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో బౌలింగ్‌ బలంగా కనిపిస్తున్నది. చీఫ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో సితాంశు కోటక్‌ టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యహరిస్తున్నాడు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *