టీడీపీ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరుతుందా?.. చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో ఏయే పార్టీలు కలిసి బరిలో నిలుస్తాయనే దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. వైసీపీ తాము సింగిల్‌గానే బరిలో నిలుస్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా?, లేదా ఎన్డీయే కూటమిలో చేరుతుందా?, లేదా జనసేన పార్టీని మాత్రమే  కలుపుకుని ముందుకు సాగుతుందా? అనే చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. 

అయితే టీడీపీ తిరిగి ఎన్డీయే గూటికి చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. దీనిపై సరైన సమయంలో మాట్లాడతానని చెప్పారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన అనంతరం చంద్రబాబు ఏఎన్‌ఐ వార్తాసంస్థతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో చేరే ప్రణాళిక గురించి ప్రశ్నించగా..  ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై మాట్లాడే సమయం ఇది కాదని, సరైన సమయంలో దీనిపై మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. 

ఇక, 2024లో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్. ఇది నా పెద్ద ఎజెండా. రాష్ట్ర పునరాభివృద్దికి, పునర్నిర్మాణానికి నేను సిద్ధం చేస్తాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కూర్చున్నారు.. సచివాలయంలో కూర్చున్నారు.. కేబినెట్‌ సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు?.. ఇది తాత్కాలికమా? . గత పదేళ్లుగా అవి పనిచేస్తున్నాయి. అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి రాజధానిని ప్లాన్ చేశాం. నేను తొమ్మిదేళ్లపాటు హైదరాబాద్ కోసం క్రమపద్ధతిలో అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థను ప్లాన్ చేశాను’’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు. 

ఇక, గతంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ  కీలక  భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ  కలిసే పోటీ చేశాయి. అయితే ధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రంలో మోదీ సర్కార్ నిరాకరించడాన్ని నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ 2018లో  బయటకు వచ్చింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత కోసం చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేశారు. అయితే అవి పెద్దగా ఫలించలేదు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలిచిన టీడీపీ ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఆ తర్వాత నుంచి తిరిగి ఎన్డీయే కూటమిలో చేరేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *