తిరుమల అలిపిరి నడకమార్గంలో ఇటీవల చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఎంత కలవరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఆరేళ్ల చిన్నారిని చిరుత పొట్టన పెట్టుకున్న వైనం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టింది. నడకమార్గాల్లో భక్తులను గుంపులుగా పంపడంతో పాటు…. వారికి రక్షణగా సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో మధ్యాహ్నం రెండు దాటిన తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను మెట్ల మార్గంలో అనుమతించకూడదని కూడా టీటీడీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు భక్తుల భద్రత కోసం… నడకదారిలో వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
యాత్రికులకు చేతికర్రలు పంపిణీ చేయాలని నిర్ణయించిన టీటీడీ ఈ పద్ధతిని ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం కాలిబాట మార్గంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి… ఊతకర్రలను అందజేశారు. 250 మెట్లకు ఒక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసిన టీటీడీ.. వారికి ఊతకర్రలను అందజేసింది. మొత్తం 70మంది సెక్యూరిటీ సిబ్బందికి ఊతకర్రలను అందజేశారు.
అయితే చేతి కర్రలు ఇవ్వాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కర్రలతో చిరుతలను కట్టడి చేయడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. చిరుత దాడికి యత్నిస్తే కర్రలతో ఆపగలరా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. క్రూరమృగాల ఎదురైతే కర్రలతో వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎంతమందికి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టకుండా ఆంక్షలు విధించడం ఏమిటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. టీటీడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం.
కర్రలు ఇవ్వడం మాత్రమే కాదు.. టీటీడీ మరికొన్ని నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక దారుల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తారు. అలాగే పెద్దవారికి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇటు ఘాట్ రోడ్లలో కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బైకుల్ని అనుమతిస్తోంది టీటీడీ.
భక్తులను కూడా గుంపులుగా పంపుతూ.. వారికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారు. సాధు జంతువులకు తినుబండారాలు అందించడాన్ని, అలాచేసే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. నడకదారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఆదేశించింది. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేయగా.. అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. ఇలా మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
మరోవైపుతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం.. సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 26,436 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.