ఒడిశాలో దారుణం జరిగింది. నది ఒడ్డున స్నానం చేస్తున్న మహిళను మొసలి సజీవంగా తినేసింది. జాజ్‌పూర్ జిల్లాలోని పలాత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఓ 35 ఏళ్ల జ్యోత్న్సా రాణి బిరుపా నది దగ్గర స్నానం చేస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ మొసలి ఆమెను అమాంతం నీటిలోకి లాగింది. దీనిని అక్కడికి దగ్గరలో వున్న వారు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. ఆమెను కాపాడాలని జనం ప్రయత్నించినప్పటికీ ఆ మొసలి ఛాన్స్ ఇవ్వలేదు. చూస్తుండగానే బాధితురాలు దానికి ఆహారమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టి మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారిపై మొసలి దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి బంధువులు, గ్రామస్తులు మొసలిని నదిలో నుంచి బయటకు తీసి కొట్టి చంపారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఇకపై ఒంటరిగా గంగ నది ఒడ్డుకు వెళ్లకూడదని భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ పూర్ నివాసి ధర్మేంద్ర దాస్ మోటార్ సైకిల్ కొనుగోలు చేశాడు. కుటుంబమంతా గంగా నదిలో స్నానమాచరించి, గంగా ఒడ్డున బండికి పూజ చేయాలని భావించారు. ఈ మేరకు గంగా నదిపై ఉన్న ఖాల్సా ఘాట్‌కు చేరుకున్నారు. ధర్మేంద్ర దాస్ కుటుంబం నదిలో స్నానం చేస్తుండగా.. సడెన్ గా అంకిత్ పై ఓ మొసలి దాడి చేసింది. వారి కళ్ల ముందు అకింత్ ను మొసలి నీటిలోకి ఈడ్చుకెళ్లి.. ముక్కులు ముక్కలుగా కొరికి సజీవంగా తినేసింది.
అంకిత్ మృతదేహం దాదాపు గంట సేపు వెతికి.. బయటకు తీశారు.అంకిత్ మృతి చెందడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు, బంధువుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో కోపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్తులు నదిలో ఉన్న మొసలిని బయటకు తీసి కర్రలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బిదుపూర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సిరాజ్ హుస్సేన్ తెలిపారు. మొసలి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.