షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి కుండపోతగా వర్షం పడుతున్నది. దీంతో ఉన్నపళంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సోమవారం ఒక్క రోజే షిమ్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 16 మంది మరణించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (16.08.2023) ఒక్క రోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళశాలలకు సెలవు ప్రకటించింది.
భీకర వర్షం కారణంగా బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తెరవొద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో అధికారులు తెలిపారు.
Also Read: నో డౌట్.. 21వ శతాబ్దం మనదే.. మన విద్యార్థులు, యువతదే: చంద్రబాబు నాయుడు
షిమ్లాలో సోమవారం ఒక్క రోజే రెండు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఒకటి సమ్మర్ హిల్ ఏరియాలోని శివ టెంపుల్ వద్ద, ఫాగ్లీ ఏరియాలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ రెండు ఘటనల్లో కనీసం 16 మంది మరణించారని అధికారులు మాట్లాడుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో పేకమేడల్లా కూలిపోయిన ఇళ్లకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
శిమ్లాలోని కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చూస్తుండగా కళ్ల ముందరే క్షణాల వ్యవధిలోనే ఇల్లు ధ్వంసమైపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్ష సంబంధం తీవ్ర ఘటనలతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 55కు చేరినట్టు సమాచారం.