పేదలకు నష్టం పెద్దలకు లాభం

భారతదేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా వృద్ధి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంగా పేదల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగటంలేదు. శ్రామికుల ఆదాయం నిత్యావసర ధరలకు సరిపోవడం లేదు. చాలామంది కార్మికులు, రైతులు మరింత పేదలుగా మారారు. అదే సమయంలో పారిశ్రామికవర్గాల లాభాలు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి.

2023 మార్చిలో లేబర్‌ బ్యూరో ప్రచురించిన డాటా ప్రకారం, వ్యవసాయ వృత్తుల్లో ఉన్న గ్రామీణ సాధారణ కార్మికుల వాస్తవ వేతనాలు గత ఐదేండ్లలో ఏడాదికి 0.5 శాతం మాత్రమే పెరిగాయి. వ్యవసాయేతర వృత్తుల్లోని కార్మికులకు, ఈ కాలంలో వాస్తవ వేతనాలు ఏడాదికి 0.7 శాతం తగ్గాయి. దీంతో కార్మికులు, రైతులు పేదలుగానే మిగిలిపోతున్నారు. వారిలో చాలామంది పేదలు పెరుగుతున్నారు. అదే సమయంలో ధనికులు ఇంకా ధనవంతులుగా ఎదిగారు. స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో జాబితా చేయబడిన అన్ని కంపెనీల మొత్తం అమ్మకాలు 2018-19 కంటే 2022-23లో 42 శాతం ఎక్కువగా ఉండగా, వాటి నికరలాభం 189 శాతం పెరిగింది. కార్పొరేట్‌ పన్ను రేట్లలో, బడా పెట్టుబడిదారీ కంపెనీలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లలో పదేపదే కోత విధించిన ఫలితం ఇది.

పారిశ్రామికవేత్తల లాభాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, మన దేశంలోని అతి సంపన్న పెట్టుబడిదారులు ప్రజలకు అవసరమైన వస్తువులు, సేవలను ఉత్పత్తి చేసే రంగాల్లో పెద్దగా పెట్టుబడి పెట్టడం లేదు. దీనికి కారణం కార్మికులు, రైతుల కొనుగోలు సామర్థ్యం పడిపోవడమే. సబ్బు, డిటర్జెంట్‌, టూత్‌పేస్ట్‌ వంటి వినియోగ వస్తువుల అమ్మకాలు పడిపోవడం వారి పేదరికాన్ని ప్రతిబింబిస్తున్నది. గత నాలుగేండ్లలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 25 శాతానికి పైగా పడిపోయాయి. ఒక వైపు, టాటా, బిర్లా, అంబానీ, అదానీ, ఇతర కార్పొరేట్‌ శక్తులు తమ సంపదను చాలా వేగంగా విస్తరించుకుంటున్నారు. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తగినట్టు కార్మికుల వేతనాలు పెరగటం లేదు. కొద్ది సంఖ్యలో ఉన్న అతి సంపన్న పెట్టుబడిదారులకు, కోట్లాది మంది కార్మికులు, రైతులకు మధ్య అంతరం పెరగడం పెట్టుబడిదారీ వ్యవస్థ ఫలితమే. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారీ వర్గాల లాభాలను పెంచడానికి చేస్తున్న కుట్రపూరిత విధానాల ఫలితమే. కార్మికులు, కర్షకులు దేశానికి పాలకులుగా మారి, ప్రజల అవసరాలను తీర్చే దిశగా ఉత్పత్తి వ్యవస్థను పునరంకితం చేస్తేనే అందరికీ శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *