మణిపూర్‌లో విడుదలైన ‘ఉరి’ – 25 ఏళ్ల తర్వాత ప్రదర్శితమైన మొదటి హిందీ సినిమాగా రికార్డ్!

77వ స్వాతంత్ర దినోత్సవం మణిపూర్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందుకు కారణం సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ రాష్ట్రంలో మొదటిసారి ఓ హిందీ సినిమా ప్రదర్శనకు నోచుకోవడమే. తీవ్రవాదుల హెచ్చరికతో ఇన్ని సంవత్సరాలు హిందీ సినిమాలకు దూరమైన మణిపూర్ రాష్ట్ర ప్రజలు, థియేటర్ల యజమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ పక్క జాతుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓ విద్యార్థి సంఘం చేసిన సాహసంతో ఓ బాలీవుడ్ సినిమా మణిపూర్ లో ప్రదర్శితమైంది. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చివరగా విడుదలైన బాలీవుడ్ సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’. ఆ రాష్ట్రంలో 1998 నుంచి 2023 ఆగస్టు 14 వరకు బాలీవుడ్ పై నిషేధం కొనసాగింది.

అయితే 2023 ఆగస్టు 15 మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలోని చుర్ చంద్రపూర్ జిల్లాలోని రంగ్ కై లో ఉన్న ఓ తాత్కాలిక థియేటర్లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన’ ఉరి ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాను ప్రదర్శించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాని థియేటర్లో ప్రదర్శించడానికి ముందు జాతీయ గీతాలాపన చేశారు. మైతీయులకు, కుకీలకు మధ్య ఈ జిల్లాలోనే ఎక్కువ ఘర్షణలు జరిగాయి. హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే కుకీల అనుకూల విద్యార్థి సంఘం విక్కీ కౌశల్ ‘ఉరి ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాని ప్రదర్శించింది.

మైతీయుల అతివాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ హిందీ సినిమాలను ప్రదర్శించకూడదని సుమారు 25 ఏళ్ల కింద గట్టి హెచ్చరిక జారీ చేసింది. అలా నిషేధం విధించిన వారం రోజుల్లోనే అక్కడ తిరుగుబాటుదారులు హిందీ సినిమాలకు సంబంధించిన 6000 నుంచి 8 ఆడియో, వీడియో క్యాసెట్లు, కాంపాక్ట్ డిస్క్ లను తగలబెట్టేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో ఒక్క హిందీ సినిమా కూడా విడుదల కాలేదు. కానీ దేశానికి వ్యతిరేకమైన ఇలాంటి నిషేధాలపై తిరగబడాలనే ఉద్దేశంతోనే ‘ఉరి ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాని ప్రదర్శించామని స్థానిక తెగల సంఘ నేత గింజ వల్జాంగ్ ఓ ప్రకటనలో చెప్పారు. తీవ్రవాదులు దశాబ్దాల పాటూ గిరిజన తెగలను మాయ చేశారని, జనాలు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఇక ‘ఉరి ద సర్జికల్ స్ట్రైక్’ సినిమా విషయానికొస్తే.. 2016 లో జరిగిన ‘ఉరి అటాక్’ ఆధారంగా ఆదిత్యధర్ ఈ సినిమాని తరికెక్కించారు.   విక్కీ కౌశల్, యామి గౌతమ్, మోహిత్ రైనా, కృతి కుల్హరి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2019 జనవరి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ ని అందుకుంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.

Also Read : మయోసైటీస్‌తో సమంత ఎంతలా పోరాడిందో చెప్పలేను – ఆమె ముఖంలో నవ్వు చూడాలి, అదే నా కోరిక : విజయ్ దేవరకొండ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *