50 ఓవర్లలో 515 పరుగులు.. వన్డేల్లో పెను సంచలనం ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో సంచలన గణాంకాలు నమోదయ్యాయి. అర్జెంటీనా అండర్-19తో జరిగిన మ్యాచ్ లో అమెరికా యువ జట్టు ఏకంగా 450 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో గత పలు రికార్డులు బద్దలయ్యాయి.
టొరొంటో వేదికగా ఆగస్ట్ 14 జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 515 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అర్జెంటీనా జట్టు 65 పరుగులకే కుప్పకూలింది. అమెరికా బ్యాటర్లలో భవ్యా మెహతా 91 బంతుల్లో 136 పరుగులు చేయగా, రిషి రమేష్ 59 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అనంతరం అమెరికన్ పేసర్ ఆరిన్ నాదకర్ణి 6 వికెట్లతో చెలరేగడంతో అర్జెంటీనా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు.
కనుమరుగైన గత రికార్డులు
- ఈ మ్యాచ్‌కు ముందు వరకు 2002లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు.. కెన్యాపై చేసిన 480 పరుగులే అత్యధిక స్కోర్‌గా రికార్డుల్లో ఉండేది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా.. ఆసీస్ రికార్డును బద్దలు కొట్టి, అండర్-19 వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా అవతరించింది.
- 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఇదే అతి పెద్ద విజయం. దీనిని అమెరికా జట్టు తుడిచిపెట్టేసింది. 450 పరుగుల అతి పెద్ద విజయాన్ని నమోదుచేసి.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
- అలాగే ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా, అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా అమెరికా రికార్డుల్లో కెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 506 పరుగులు చేసిన తమిళనాడు జట్టు, 435 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డు అమెరికా వశమైంది.
©️ VIL Media Pvt Ltd.