Asia cup : ఈ ఏడాది అసలు టోర్నమెంట్ జరుగుతుందా.. లేదా? అన్న సందేహాల మధ్య ఆసియాకప్ (Asia Cup 2023)కు రంగం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఆసియా సింహాలు కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఆసియా కప్ వచ్చిన ప్రతిసారి అభిమానులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఓసారి టీ20 ఫార్మాట్(T20)లో, మరోసారి వన్డే ఫార్మాట్ (ODI)లో టోర్నీని టోర్నీ నిర్వహించడమే అందుకు కారణం. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీకి ఓ పద్ధతి అంటూ ఉండదా? అని క్రికెట్ ప్రేమికులు చర్చించుకుంటున్నారు. నిజమే మరి. నిరుడు ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈసారి వన్డే ఫార్మాట్ ఎంచుకున్నారు. ఎందుకిలా ? దీని వెనకున్న కారణమేంటి? అన్న ప్రశ్న అభిమానులను వేధిస్తోంది.
ఆసియా కప్ పోటీలు 1984లో మొదలయ్యాయి. ఈ టోర్నీ ఇప్పటి వరకు17 ఎడిషన్లు పూర్తిచేసుకుంది. అయితే.. ఎన్నడూ లేని విధంగా 2016 నుంచి ఫార్మాట్లు మారుతున్నాయి. యూఏఈ వేదికగా నిరుడు జరిగిన ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. పాక్ (Pakistan)చేతిలో భంగపడిన భారత జట్టు (Team India) టోర్నీ నిష్క్రమించింది. ఫైనల్లో పాక్‌ను దెబ్బకొట్టిన శ్రీలంక (Sri Lanka) ట్రోఫీని ముద్దాడింది. ఈ నెల 30న పాకిస్థాన్-నేపాల్ (Nepal) మ్యాచ్‌తో ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈసారి వన్డే ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది.
శ్రీలంక
వన్డే నుంచి టీ20 ఫార్మాట్‌కు
ఆసియా కప్‌ను 2014 వరకు వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహించారు. 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్‌ను ప్రవేశ పెట్టారు. 2018లో మళ్లీ వన్డే ఫార్మాట్‌లోకి మారింది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా 2020లో జరగాల్సిన టోర్నీని 2022కు వాయిదా వేశారు. యూఏఈ (UAE)వేదికగా జరిగిన ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో పెట్టారు. మళ్లీ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.
ఫార్మాట్ల మార్పు ఎందుకు?
ఆసియా కప్ టోర్నీ ఫార్మాట్ల మార్పుపై 2015లోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ తర్వాత జరిగే ఐసీసీ మెగా టోర్నీని బట్టి ఫార్మాట్లు మార్చాలని నిర్ణయించింది. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది. అందుకనే ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.
ఆసియా కప్ ట్రోఫీతో భారత జట్టు
2016లో టీ20 ప్రపంచకప్ ఉన్నందున బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియాకప్‌ను తొలిసారి టీ20 ఫార్మాట్‌లో పెట్టారు. 2018లో జరిగిన ఆసియా కప్‌ను మళ్లీ వన్డే ఫార్మాట్‌లోనే జరిపారు. ఆస్ట్రేలియా (Australia) వేదికగా నిరుడు జరిగిన టీ20 ప్రపంచ కప్ ముందు ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు. ఇకపై కూడా ఇదే పద్దతి కొనసాగుతుంది. ఇలా చేయడంతో ఆయా ఫార్మాట్లకు ముందుగానే ఆటగాళ్లు అలవాటు పడతారన్నది ఏసీసీ ఉద్దేశం.