Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలెక్టర్ పుల్కిత్ ఖరే తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బృందావన్‌లోని షౌ షయ ఆసుపత్రికి తరలించారు.
వర్షం కారణంగా మూడంతస్తుల భవనం బాల్కనీ కూలిపోయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మృతుల కుటుంబాలకు నిబంధన ప్రకారం పరిహారం.. అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామని, ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. గత కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, తడిసిపోవడంతో కూలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని, పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. సంఘటనా స్థలంలో కార్పొరేషన్ బృందం పరిశీలిస్తుందని, ఏదైనా భవనంలో ఏదైనా భాగం దెబ్బతిన్నట్లు గుర్తిస్తే దాన్ని సైతం కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కూలిపోవడంతో హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.