వాషింగ్టన్: వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ వద్ద ఒక మహిళ గన్‌తో హల్‌చల్ చేసింది. కొన్ని కార్లపైకి తుపాకీని గురిపెట్టింది (US Woman Points Gun At Cars). ఇది చూసి వాహనదారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గన్ గురిపెట్టిన మహిళ మీదకు పోలీస్ కారును దూకించారు. దీంతో ఆమె రోడ్డుపై పడింది. చేజారిన గన్ తీసుకునేలోపు పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని నసావు కౌంటీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బెల్‌మోర్, జెరూసలేం అవెన్యూ జంక్షన్ వద్ద ఒక మహిళ చేతిలోని గన్ గురిపెట్టి అక్కడి వారిని భయపెట్టింది. తుపాకీని గాల్లోకి కూడా పేల్చింది. దీంతో పలు వాహనాల్లో ఉన్న పిల్లలు, పెద్దలు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆ మహిళ గన్‌ను తన తలకు గురిపెట్టుకున్నది. ఇంతలో పోలీస్ కార్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ రోడ్డుపై పడింది. అనంతరం పైకి లేచేందుకు ఆమె ప్రయత్నించింది. అలాగే చేతి నుంచి జారి దూరంగా పడిన గన్‌ను తీసుకోబోయింది. ఇంతలో పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తించిందో అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణనష్టం నివారించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.