ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటూ వర్షాలు

ఏపీలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. ఉక్కపోత కూడా తోడవ్వడంతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు.

బుధవారం కూడా రాష్ట్రంలో వానలు పడ్డాయి.. కోస్తాంధ్రలోని గుంటూరులో 58.4 మిల్లీ మీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 55.4, రణస్థలంలో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా కొరాడలో 38.4, బాపట్లలో 35.9, గుంటూరు జిల్లా తెనాలిలో 31.2, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 28.6, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 25.4, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 25, ఏలూరు జిల్లా కుక్కునూరులో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే.. తిరుపతి జిల్లా తడలో 50 మిల్లి మీటర్లు, తిరుపతిలో 40.7, తిరుపతి జిల్లా సూళ్లూరు పేటలో 34.8, సత్యవేడులో 27.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఏపీలో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే అధికంగా నమోదవుతున్నాయి. రెండు వారాల నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావమే కనిపించడం లేదు. జులైలో కురిసిన వర్షాలతో సీజన్‌ గాడిలో పడిందని అనుకున్నారు.. కానీ ఆగస్టు మొదటి వారం నుంచి పరిస్థితి మారిపోయింది. గడచిన రెండు వారాల్లో కేవలం అక్కడక్కడా వర్షాలు కురిశాయి తప్ప.. భారీగా వానలు పడలేదు. ఎండలు, ఉక్కపోత దెబ్బతో ప్రజలు ఇబ్బందిపడుతుండగా.. రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనాలకు అనువైన వాతావరణం లేకపోవడంతో పాటూ నైరుతి రుతుపవనాలు బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్‌లో నైరుతి దిశలో గాలులు వీయాల్సి ఉంది.. కొద్ది రోజుల నుంచి పడమర/వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తుండడంతో పొడి వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు తేమతో కూడిన గాలులు తోడైతే ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తుంటాయి. కానీ ప్రస్తుతం వర్షాలు కురిసే పరిస్థితి లేదు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా మారాయి అంటున్నారు. ఆగస్టులో కొన్ని జిల్లాల్లో రోజుల తరబడి వర్షాలే లేవు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల 37 నుంచి 39 డిగ్రీల వరకు నమోదుకావడం వేసవిని తలపిస్తోంది. రుతుపవనాలు బలపడేంత వరకు ఎండలు తప్పవు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా వస్తుందంటున్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పెరుగుతాయంటున్నారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *