శ్రావణం.. శుభరం

  • నేటి నుంచి నిజ శ్రావణ మాసం షురూ..
  • ఆలయాల్లో నెల రోజులపాటు ప్రత్యేక పూజలు
  • సత్తుపల్లి/సారపాక, ఆగస్టు 16 : సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నెల రోజులపాటు మహిళలు లక్ష్మీదేవికి పూజలు చేయడంతోపాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం కానుండగా.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారనుంది. ఈ ఏడాది అధికమాసం రావడంతో కృష్ణాష్టమి, పొలాల అమావాస్య సెప్టెంబర్‌లో రానున్నాయి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం.. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం.. శ్రీకృష్ణుడు అవతరించింది కూడా శ్రావణ మాసంలోనే. బలిచక్రవర్తి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు. ఈ మాసంలోనే శ్రీమహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి.

    శ్రావణం ప్రత్యేకతలు, నియమాలు

    సోమవారం : ముక్తి ప్రధాత ముక్కంటికి ప్రీతికరమైనది. ఈరోజు స్వామివారిని పూజిస్తే కటాక్షం పొందవచ్చని, శివునికి అభిషేకం చేస్తే శుభం కలిగి పాపాలు తొలగిపోతాయి. మంగళవారం : సకల దేవతల కంటే ముందే పూజలందుకునే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రమణ్యేశ్వరుడు మంగళవారం జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళ గౌరికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధ, గురువారాలు అయ్యప్పకు ప్రీతికరమైన రోజులు. గురువారం రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, సాయిబాబాలకు ప్రీతికరమైన రోజులుగా పరిగణిస్తారు. శ్రావణమాసంలో వచ్చే ప్రతీ శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైనది. శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసుకుని అమ్మవారిని కొలుస్తారు.

    శ్రావణంలో వచ్చే పండుగలు

    మంగళగౌరీ వ్రతం ప్రతీ మంగళ, శుక్రవారాలు ఆచరిస్తారు. ముత్తైదువులు, యువతులు ఆచరించే వ్రతం అత్యంత విశేషమైనది. అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. చివరివారంలో పసుపు, కుంకుమతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. శ్రావణశుద్ధ చవితి పంచమి రోజున వచ్చే నాగుల చవితి పండుగ(ఆగస్టు 21)ను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

    వరలక్ష్మీ వ్రతం

    నిత్యం సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(ఆగస్టు 25) ఈ వ్రతాన్ని అత్యంత నియమ నిష్టలతో మహిళలు ఆచరిస్తారు.

    శ్రావణ పౌర్ణమి

    శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్‌, జంజాల పౌర్ణమిగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని ఆగస్టు 30న జరుపుకోనున్నారు. అదేరోజు హయగ్రీవ జయంతి, సంతోషిమాత జయంతి కావడం విశేషం.

    కృష్ణాష్టమి

    శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే ఏడాదిలో 24 ఏకాదశ వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

    మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం

    శ్రావణమాసం మహావిష్ణువు, ఆయన సతీమణి మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నేటి నుంచి నిజశ్రావణం ప్రారంభమవుతుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలను ముస్తాబు చేశారు. ఈ నెలలో శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్లు, పేరంటాళ్లు, గృహ ప్రవేశాలు జరగనున్నాయి.

    నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

    భద్రాచలం, ఆగస్టు 16 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18న నిజ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఉదయం లక్ష్మీతాయారుఅమ్మవారి ఉత్సవమూర్తులకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం, అనంతరం సామూహిక లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం స్వామివారికి సంధ్యాహారతులు, రాత్రికి స్వామివారికి చుట్టు సేవ నిర్వహిస్తారు. 21న చిత్తా నక్షత్రం సందర్భంగా ఉదయం యాగశాలలో సుదర్శన హోమం, 25న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, సాయంత్రం 4 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చన, సాయంత్రం సంధ్యా హారతులు, రాత్రికి స్వామివారికి చుట్టు సేవ నిర్వహించాల్సి ఉంది. 26 నుంచి 31 వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 26న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పవిత్రోత్సవాలకు అంకురారోపణం, రాత్రికి స్వామివారికి పవళింపు ఉండదు. 27న ఉదయం పవిత్రోత్సవాలకు అగ్ని ప్రతిష్ట అష్టోత్తర శత కలశవాహన, పవిత్రాధివాసం, హవనం, రాత్రి తిరువీధి సేవ, స్వామివారికి పవళింపు సేవ ఉండదు.

    28న ఉదయం 8.45 నుంచి 10గంటల వరకు 108 కలశాలతో కలశ స్నపనం, అనంతరం అలంకారం, నిత్య పూర్ణాహుతి, పవిత్రారోపణం, రాత్రికి హవనం, చుట్టుసేవ జరపాల్సి ఉంది. స్వామివారికి పవళింపు సేవ ఉండదు. 29న త్రయోదశి, 30 చతర్థశి, ఉదయం, సాయంత్రం హవనం, రాత్రికి స్వామివారికి పవళింపు ఉండదు. 31న హయగ్రీవ జయంతి సందర్భంగా ఉదయం హయగ్రీవ స్వామివారికి స్నపన తిరుమంజనం, హవనం, సాయంత్రం మహా పూర్ణాహుతి, తిరువీధి సేవ, చుట్టు సేవ, రాత్రికి కుంభ ప్రోక్షణ, పవిత్రారోపణం, సెప్టెంబర్‌ 1న శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీలక్ష్మీ తాయారమ్మ వారికి సామూహిక కుంకుమార్చన, సాయంత్రం సంధ్యా హారతులు, రాత్రికి స్వామివారికి చుట్టు సేవ ఉంటుంది. 7న వైష్ణవ కృష్ణ జయంతి, సాయంత్రం కృష్ణ అవతారోత్సవం, ప్రత్యేక ఊంజల్‌ సేవ, లాలలు-జోలలు, రాత్రికి వివిధ రకాల పిండి వంటలు, పళ్లు స్వామివారికి నివేదన, పవళింపు సేవ ఉండదు. 8న శుక్రవారం సందర్భంగా లక్ష్మీ తాయారమ్మ వారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం సామూహిక కుంకుమార్చన, అనంతరం సంధ్యాహారతులు. 10న ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం అంతరాలయంలో సామూహిక లక్ష కుంకుమార్చన, విశేష భోగ నివేదన, రాత్రికి తిరువీధి సేవ, చుట్టుసేవ, పవళింపు ఉండదు. 15న అమ్మవారికి పుష్పాంజలి సేవ, వివిధ రకాల పుష్పాలతో అర్చన ఉంటుంది.

    Posted in Uncategorized

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *