ఆసియా కప్ గెలిస్తే.. భారత్‌కు భలే బొనాంజా.. సఫారీలు ఓ చెయ్యేస్తే సరి..!

ఆసియా కప్ ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బదులుగా భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసినప్పటికీ.. అక్షర్ పటేల్ (42) మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా పరాజయం పాలైంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్ వన్డేల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి సమీకరణం ఇలా ఉంది. భారత్ బంగ్లాపై గెలవడంతోపాటు ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించాలి. అదే సమయంలో ఆస్ట్రేలియా తన చివరి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడాలి. సౌతాఫ్రికాతో నాలుగో వన్డేలో ఆసీస్ ఓడింది. కానీ భారత్ కూడా బంగ్లా చేతిలో ఓడింది. ఇప్పుడు భారత్ నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలంటే.. ఆసియా కప్ ఫైనల్లో గెలవాలి. అదే సమయంలో చివరి వన్డేలో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా ఓడించాలి. అప్పుడు భారత్ నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంటుంది. అదే జరిగితే టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలుస్తుంది.

ఒకవేళ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. రోహిత్ సేన రెండో స్థానంతో సంతృప్తి పడాాల్సి ఉంటుంది. కానీ అప్పుడు పాకిస్థాన్ రెండో స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోతుంది.

అలాగనీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆసియా కప్ ముగిశాక.. వరల్డ్ కప్ ముందు భారత్ ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో గెలిస్తే.. టీమిండియా వరల్డ్ నంబర్ వన్ జట్టుగా వరల్డ్ కప్‌లో అడుగుపెడుతుంది. టీమిండియా ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి వరకూ వన్డేల్లోనూ మన జట్టే నంబర్ వన్‌గా ఉంది.

రోహిత్‌కు అవరోధాలు..

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే.. గత కొన్నాళ్లుగా వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న హిట్ మ్యాన్.. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ కూడా సృష్టించాడు. కానీ బంగ్లాపై డకౌట్ కావడం ద్వారా డబుల్ డిజిట్ స్కోరును అందుకోలేకపోయాడు.

వన్డే ఫార్మాట్ ఆసియా కప్‌లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా తిరుగులేని రికార్డ్ ఉంది. బంగ్లాతో మ్యాచ్ ముందు వరకూ రోహిత్ ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్లో) 9 మ్యాచ్‌ల్లో టీమిండియాకు సారథ్యం వహించగా.. 8 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది, ఒక మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. కానీ బంగ్లా చేతిలో ఓటమితో రోహిత్ వరుస వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఓవరాల్‌గా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు బంగ్లాదేశ్‌పై ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *