భర్తను వెంటాడి వేధిస్తోన్న భార్య.. బాధితుడికి అండగా నిలిచిన హైకోర్టు

కట్టుకున్నవాడి వేధింపులు, అత్తింటి ఆరళ్లతో మహిళలు గృహహింసను ఎదుర్కోవడం సర్వసాధారణం. కానీ, భార్యే వేధింపులకు గురిచేసి.. భర్తను ఇబ్బందులు పెడుతున్న ఘటన ఇది. భార్య హింసను భరించలేక లబోదిబోమన్న భర్తకు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం అండగా నిలిచింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన దంపతులు అభిప్రాయబేధాలతో 2005లోనే వేరుపడ్డారు. అయితే, భార్య మాత్రం భర్తను తరుచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేస్తూ.. అతడిపై పదే పదే క్రిమినల్‌ కేసులు పెట్టి మనశ్శాంతి లేకుండా చేసింది. దీంతో ఇరువురి మధ్య కోలుకోలేని పెద్ద అగాథం ఏర్పడి.. ఆ జంట మళ్లీ కలిసే అవకాశమే లేకుండా పోయింది.

వీరు ఇక కలసి ప్రయాణం చేయడం అసాధ్యమని భావించిన ఓ కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరుచేసింది. కానీ, సదరు భార్య మాత్రం ససేమిరా అంది. విడాకులకు సముఖంగా లేని ఆమె ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. తన భర్తే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆయనను తాను వేధిస్తున్నట్టు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. అందుకే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను రద్దు చేయాలని ఆమె కోరింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైటీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌ను తిరస్కరించారు.

సెప్టెంబరు 13న ఈ వ్యాజ్యంపై తీర్పు వెలువరించిన ధర్మాసనం.. సదరు మహిళపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘకాలంగా దంపతులు వేర్వేరుగా ఉండి.. విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు భర్త మరో మహిళతో కలిసున్నందున విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనను తోసిపుచ్చింది. భర్త, అత్తింటి పట్ల ఆమె అమర్యాదగా ప్రవర్తించిందనీ, అగౌరవపరుస్తూ తరచూ క్రిమినల్‌ ఆరోపణలతో కట్టుకున్నవాడికి మనశ్శాంతి లేకుండా చేసిందని వ్యాఖ్యానించింది. ఆమె వైఖరితోనే భర్త మరొక మహిళ సాంగత్యంలో ఊరట పొంది ఉండవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

అయినా, విడాకుల కేసు దాఖలు చేసిన తరవాత జరిగిన విషయం కాబట్టి.. ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది. భార్య క్రూర ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని కుటుంబ న్యాయస్థానం.. బాధిత భర్తకు విడాకులు మంజూరుచేయడం సరైందేనని సమర్థించింది. ఈ కేసులో భర్త రెండోపెళ్లి చేసుకున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలు కూడా లేవని జస్టిస్ సురేశ్ కుమార్ కైటీ, జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

‘ఇటువంటి సుదీర్ఘ విభేదాలు.. నేరపూరిత ఫిర్యాదులు ప్రతివాది-భర్తకు మనశ్శాంతి, దాంపత్య జీవితాన్ని కోల్పోయేలా చేశాయి.. ఇది ఏదైనా వైవాహిక బంధానికి పునాది.. చాలా సంవత్సరాలు పాటు వేరుగా ఉండి మళ్లీ కలిసే అవకాశం లేకుండా పోవడంతో మరొక మహిళ సాంగత్యంలో అతడు మనశ్శాంతి పొంది ఉండవచ్చు.. కానీ, అది విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న తరువాత జరిగిన సంఘటన.. క్రూరత్వం రుజువైన కారణంగా కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడం సబబే’ కోర్టు ఉద్ఘాటించింది.

Read More Latest National News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *