నిజ జీవితంలో జరగని విషయాల్ని వెండి తెరపై చూస్తే ఓ రకమైన సంతృప్తి, ఆనందం. టైమ్ ట్రావెలింగ్ కూడా అలాంటిదే.
ఓ మనిషి తన గతం, భవిష్యత్తులోకి వెళ్లడం అసాధ్యం. కానీ వెళ్తే బాగుంటుందన్న ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఊహనే కథలుగా అల్లి, సినిమాలు తీస్తుంటారు. కాబట్టి ఈ జోనర్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
ఆదిత్య 369, 24, ఒకే ఒక జీవితం.. కథలు అలా పుట్టినవే.
ఇప్పుడు విశాల్ కూడా ఈ జోనర్ టచ్ చేశాడు. ఓ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లొచ్చు అనే ఓ అందమైన ఊహని కథగా ఎంచుకొని సినిమా తీశాడు. అదే ‘మార్క్ ఆంటోనీ’.
మరి ఈ సినిమా ఎలా ఉంది? విశాల్ చేయించిన టైమ్ ట్రావెలింగ్ టూర్ సక్సెస్ అయ్యిందా, లేదా?
ట్రింగ్.. ట్రింగ్…. ట్రిక్కు!
ఓ సైంటిస్ట్ అహర్నిశలూ కష్టపడి ఓ టైమ్ ట్రావెలింగ్ ఫోన్ కనిపెడతాడు. ఆ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి.. అక్కడి మనుషులతో మాట్లాడొచ్చు. మన జాతకాన్ని మార్చుకోవచ్చు.
ఈ టైమ్ ట్రావెలింగ్ ఫోన్… మార్క్ (విశాల్) చేతికి చిక్కుతుంది. తనో మెకానిక్. తండ్రి ఆంటోనీ (విశాల్) ఒకప్పుడు డాన్. తన తమ్ముడ్ని చంపాడన్న కోపంతో ఆంటోనీని ఏకాంబరం (సునీల్) చంపేస్తాడు.
తన తండ్రంటే.. మార్క్‌కి ఏ మాత్రం ఇష్టం ఉండదు. తన తల్లిని తండ్రే చంపాడన్న కోపం తనది. అయితే.. ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి, తన తల్లిని బతికించుకోవాలనుకుంటాడు మార్క్. అంతేకాదు గ్యాంగ్ స్టర్ అవ్వాలన్న తండ్రి ఆలోచనని మార్చి, మంచి మార్గంలో పెట్టాలని భావిస్తాడు.
మరి.. మార్క్ అలా చేయగలిగాడా? ఆంటోనీ స్నేహితుడు జాకీ (ఎస్.జె.సూర్య) కథేమిటి?
ఈ టైమ్ ట్రావెలింగ్ ఫోన్‌తో వీళ్లంతా ఎలాంటి ట్రిక్కులు చేశారు? అనేది మిగిలిన కథ.
గజిబిజి గందరగోళం
టైమ్ ట్రావెల్ ఫోన్‌ని కనుక్కొన్న సైంటిస్ట్ కోణం నుంచి ఈ కథ మొదలవుతుంది. సాయికుమార్ వాయిస్ ఓవర్‌లో.. దాదాపు కథంతా చదివి, ప్రేక్షకుల బుర్రకు ఎక్కించే ప్రయత్నం చేశారు.
ఆంటోనీ, జాకీల స్నేహం, ఏకాంబరంతో వైరం, ఆంటోనీని ఏకాంబరం చంపేయడం, ఏకాంబరం కోసం జాకీ అన్వేషించడం.. ఇలా పాతికేళ్ల కథని రెండు నిమిషాల వాయిస్ ఓవర్‌లో ముగించారు.
అసలు ఆ ఫోన్ ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? ఆ ఫోన్ వాడకంలోని నియమ నిబంధనలేంటి? ఇవన్నీ దర్శకుడు ముందే ఓ సైన్స్ పాఠం చెప్పినట్టు చెప్పుకొంటూ పోతాడు.
అవన్నీ.. బుర్రకు ఎక్కించుకోవాల్సిందే. లేదంటే.. ఆ తరవాత కన్‌ఫ్యూజ్ మొదలైపోతుంది. ఫోన్ చేయగానే మెరుపులు రావడం, మనిషి గాల్లోకి ఎగరడం.. ఇవన్నీ మరీ ఓవర్ ది బోర్డ్ వ్యవహారాల్లా అనిపిస్తాయి.
మార్క్‌కి ఫోన్ దొరికి, తన తల్లికి ఫోన్ చేయాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది.
తన తండ్రి ఆంటోనీ గురించి మార్క్ తెలుసుకొనే ప్రయత్నంతో కథలోని కొత్త కోణాలు బయటకు వస్తాయి.
ఇంటర్వెల్ కార్డు దగ్గర ఓ ట్విస్టుతో కథలో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
వేర్ ఈజ్ ద లాజిక్
టైమ్ ట్రావెలింగ్ కథంటేనే లాజిక్‌కి ఏమాత్రం అందదు. అసలు ఇలాంటి కథల్లో లాజిక్కులు వెతుక్కోవాల్సిన పనిలేదు.
ఎంత లాజిక్ లేకపోతే మాత్రం సన్నివేశాలు మరీ హాస్యాస్పదంగా అనిపించకూడదు కదా?
కానీ `మార్క్ ఆంటోనీ`లో కొన్ని సన్నివేశాలు చూస్తే.. ఓ క్షణం దర్శకుడి ఆలోచనా సరళేంటి ఇలా ఉంది? అనిపిస్తుంది. తనకిష్టం వచ్చినట్టు.. సన్నివేశాలు రాసుకొంటూ వెళ్లిపోయాడు.
చనిపోయిన మనుషులు ఒక్క ఫోన్ కాల్‌తో తిరిగి వచ్చేయడం మరీ లాజిక్ లెస్ గా అనిపించే వ్యవహారం. పైగా అరచి డైలాగులు చెప్పడం, ఒకే సన్నివేశాన్ని తిరిగి తిరిగి చూపించడం మరింత బోరింగ్‌గా అనిపిస్తాయి.
యాక్షన్ సన్నివేశాల్లోనూ డోస్ ఎక్కువైంది. గన్‌లూ, మిషిన్ గన్‌లూ వదిలేశారు. ఇప్పుడు ఏకంగా మిస్సైల్స్ నే రంగంలోకి తీసుకొస్తున్నారు.
కేజీఎఫ్ లో ‘పెద్దమ్మ’ అంటూ దర్శకుడు ఓ మిషిన్ గన్ వాడాడు. ఈసారి.. ‘అనకొండ’ పేరుతో ఓ మిస్సైల్ లాంటిది బయటకు తీశారు.
తెరపై హీరో ఆ అనకొండతో కాలుస్తుంటే.. వీడియో గేమ్‌లు గుర్తొస్తాయి.
ఇక క్లైమాక్స్ మరింత గందరగోళంగా తయారైంది. అయితే.. ఆ క్లైమాక్స్‌లో విశాల్ గెటప్ కొత్తగా కనిపిస్తుంది.
ఆ బొంగురు గొంతేంటో?
విశాల్ పలు రకాల గెటప్పుల్లో కనిపించే అవకాశం ఈ కథ కల్పించింది.
మార్క్ గానూ, ఆంటోనీ గానూ విశాల్ నటనలో భిన్న కోణాలు ఉన్నాయి. అయితే ఈ రెండు గెటప్పులూ తనకు సూట్ అవ్వలేదు. పైగా.. ఆంటోనీగా గొంతు మార్చి.. పాత్రలో కొత్తదనం తీసుకొద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ బొంగురు గొంతు విశాల్‌కి సెట్ కాలేదు.
ఓ దశలో ఇది విశాల్ సినిమానా, సూర్య సినిమానా? అనే అనుమానం వేస్తుంది. ఎందుకంటే.. ప్రతీ సన్నివేశంలోనూ సూర్య ప్రెజెన్స్ హైలెట్ అవుతూ ఉంటుంది.
జాకీగా తన గెటప్ బాగుంది. కానీ.. ప్రతీ డైలాగ్ అరిచి మరీ చెప్పడం విసిగిస్తుంది. సూర్య ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. వారిద్దరి మధ్య సెకండాఫ్‌లో డ్రామా రక్తి కట్టింది. అదొక్కటే.. ఈ సినిమాలో మెప్పించే విషయం.
మరోవైపు కథానాయిక రీతూ వర్మ కంటే జూనియర్ ఆర్టిస్టులు స్క్రీన్ ప్రెజెన్సే కాస్త ఎక్కువ. ఈ సినిమాలో నేనూ ఉన్నాను అని చెప్పడానికి అప్పుడప్పుడూ తెరపై కనిపించి మాయమవుతుంది రీతూ.
జూ. సిల్క్ స్మితని ఈ సినిమాలో చూపిస్తున్నాం అని చిత్రబృందం ముందు నుంచీ ఊరిస్తోంది. ఆమె కోసమైనా కొంతమంది ఈ సినిమా చూడ్డానికి ఉత్సాహం చూపించారు.
జూ.సిల్క్ ని తెరపై తొలిసారి చూసినప్పుడు ఒకప్పటి సిల్క్ గుర్తుకురావడం సహజం. అయితే ఆమె పాత్ర మరీ చిన్నది. కాసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది.
పాటలే అడ్డుగోడలు
1975-95 మధ్య కాలంలో జరిగే కథ ఇది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా కళా దర్శకులు కష్టపడ్డారు. ఈ సినిమాకిచ్చిన టోన్, కలర్ వైవిధ్యంగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కూడా సెట్టయ్యాయి.
నేపథ్య సంగీతంలో ఒకటే హోరు. పాటలూ ఏ మాత్రం మెప్పించవు. పైగా అవి అడ్డుగోడలా మారాయి.
దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ గమ్మత్తుగానే ఉంది. కానీ డీల్ చేసే విధానంలో పూర్తిగా తడబడ్డాడు. ఎక్కడా లాజిక్కులు లేకుండా తన ఇష్టానుసారం చేసుకొంటూ వెళ్లాడు.
ఓ మంచి ఐడియాని.. సరైన స్క్రీన్ ప్లే, ప్లానింగ్ లేకుండా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘మార్క్ ఆంటోనీ’ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
- టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్ పరారీలో ఉన్నారా… ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి… బాధితుల్లో చాలా మంది పిల్లలు
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే… రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి… ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్‌లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)