ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి తారలంతా సైమా ఈవెంట్ లో సందడి చేశారు.
ఇదిలా ఉండగా సైమా వేడుకలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు అవార్డుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎగరేసుకుపోయారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రకి గాను ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది. విభాగంలో అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ – సీతారామన్, నిఖిల్ – కార్తికేయ2 , సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు చిత్రాల నుంచి పోటీ పడగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ రేసులో కొనసాగారు. అయితే తుది విజేతగా ఎన్టీఆర్ నిలవడం విశేషం.
వేదికపై అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ఎన్టీఆర్ ప్రసంగం అభిమానులు కంటతడి పెట్టుకునేంతలా హృదయాల్ని హత్తుకుంటోంది. కొమరం భీం పాత్రకి నేను న్యాయం చేస్తానని నన్ను మళ్ళీ నమ్మిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా బ్రదర్, కోస్టార్ రామ్ చరణ్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.
నా అభిమానులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఒడిదుడుకుల్లో నా వెంట ఉండి కింద పడ్డప్పుడల్లా పైకి లేపినందుకు.. నా కంట కన్నీటి చుక్క వచ్చినప్పుడల్లా వారు కూడా బాధపడినందుకు.. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు సంతోషంగా నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్న అంటూ తారక్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ఎన్టీఆర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.