హైదరాబాద్ నగరంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. కోయంబత్తూర్ ఉక్కడంలోని ఈశ్వరన్ కోవిల్ స్ట్రీట్‌లోని అరుల్మిగు కొట్టై సంగమేశ్వరర్ తిరుకోవిల్ అనే పురాతన ఆలయం ముందు గత ఏడాది అక్టోబర్ 23న కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో.. ఐసిస్ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న మొహమ్మద్ అజారుద్దిన్‌ను ఇటీవల అరెస్టు చేసిన అతన్ని త్రిసూరులోని జైలులో ఉంచారు. ఈ కేసులో అరెస్టైన 13వ వ్యక్తి అతడు.
చెన్నైలోని పూనమల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు రెండు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఆరుగురిపై, జూన్ 2న ఐదుగురిపై చార్జిషీటు దాఖలు చేశారు. 12వ నిందితుడు మహ్మద్ ఇద్రిస్‌ను ఈ ఏడాది ఆగస్టు 2న అరెస్టు చేశారు. అయితే తాజాగా చేపట్టిన సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.