Asia Cup Final: హుటాహుటిన శ్రీలంక బయల్దేరిన వాషింగ్టన్‌ సుందర్‌.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌కు ముందు భారత్‌కు షాక్‌ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ శుక్రవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. గాయంతోనే బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌.. ఫైనల్‌ మ్యాచ్ నాటికి ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ఫైనల్‌ మ్యాచ్ జరిగే కొలంబో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలతో.. మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు గాయపడ్డ అక్షర్‌ పటేల్‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌లో ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌ను శ్రీలంకకు రప్పించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్ జరగనుండగా.. శనివారమే సుందర్‌ హుటాహుటిన కొలంబో బయల్దేరి వెళ్లాడని సమాచారం.

కాగా వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలోని శిక్షణ శిబిరంలో ఉన్నాడు. ఈ నెల 23 నుంచి జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనబోయే.. రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో జట్టులో సుందర్‌ సభ్యుడిగా ఉన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌ వేస్తూ.. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేసే సుందర్‌ సేవలను ఆసియా కప్‌ ఫైనల్‌లో ఉపయోగించుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫైనల్‌ జరిగే కొలంబో స్పిన్నర్లుకు అనుకూలంగా ఉండనుంది. దీంతో గాయపడ్డ అక్షర్‌ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్‌ ఆడిన తర్వాత సుందర్‌.. బెంగళూరులోని ఎస్‌సీఏలో చేరతాడు. ఏషియన్‌ గేమ్స్‌కు టీమ్‌తో పాటు చైనా వెళ్లనున్నాడు!

ఆసియా కప్‌ 2023ల సూపర్‌ 4లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచుకు ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఆసియా కప్‌ ఫైనల్‌ ఆదివారం అంటే సెప్టెంబర్‌ 17న భారత్‌-శ్రీలంకల మధ్య జరగనుంది. వన్డే వరల్డ్‌ కప్‌ మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీలో విజేతగా నిలవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *