BRS పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై.. ఒక్క వాక్యంతో సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ

అందరూ ఊహించినట్లే ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‍‌బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు తమ్మల రాజీనామా లేఖను పంపారు. కేవలం ఒకే ఒక్క వాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ‘ఇన్నాళ్లూ సహకరించినందుకు నా ధన్యవాదాలు… పార్టీకి నా రాజీనామా ఆమోదించగలరు’ అంటూ ఏక వాక్యంలో తుమ్మల తన రిజైన్ లెటర్‌ను పంపించారు.

సీఎం కేసీఆర్ తొలి మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన తుమ్మల.. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి తుమ్మలపై విజయం సాధించారు. అనంతరం కందాల బీఆర్ఎస్ గూటికి చేరగా.. అప్పట్నుంచి పార్టీకి తుమ్మల అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించగా.. పాలేరు నుంచి తనకు అవకాశం ఇస్తారని తుమ్మల భావించారు. అయితే తుమ్మలకు షాక్ ఇస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాలకు కేసీఆర్ టికెట్ కేటాయించారు.

దీంతో తుమ్మల తీవ్ర మనస్థాపం చెందారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. ఈనేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్నారనే ప్రచారం జరిగింది. అందుకు బలం చేకూర్చుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కాంగ్రెస్ నేత పొంగులేటి ఆయనతో భేటీ అయి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తాను కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత తన సన్నిహితుల వద్ద చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌, భట్టి, పొంగులేటి తదితర నేతలు మరోసారి హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

ఇవాళ, రేపు హైదరాబాద్‌లో సీడబ్య్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ ఖర్గే సహా ఇతరులు నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సమక్షంలో ఇవాళ తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరునున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి.

Read More Telangana News And

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *