హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4 కార్లు, ఓ వ్యాన్ ధ్వంసం కాగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున పిల్లర్ నెంబర్ 139 వద్ద చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా మెహిదీపట్నం వస్తున్న ఓ వ్యాన్ శనివారం తెల్లవారుజామున పిల్లర్ 139 వద్ద సడెన్‌గా బోల్తా పడింది.
దీంతో వెనకాలే వస్తున్న కారు దాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ని ఢీకొట్టగా దాని వెనకాలే వస్తోన్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.