ఓటరు ప్రభంజనం

  • ఓటు నమోదులో నయా చైతన్యం
  • 2018తో పోలిస్తే ఈ సారి 3.23 లక్షలపై చిలుకు పెరిగే అవకాశం
  • గత జనవరి నాటికే పెరిగిన ఓటర్ల సంఖ్య 1.85 లక్షలు
  • తాజాగా 1.37లక్షలపై చిలుకు కొత్త దరఖాస్తులు
  • యుద్ధప్రాతిపదికన పరిశీలన
  • వచ్చే నెల 4న తుది జాబితా
  • ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుకు ఓటర్లు పెరిగే అవకాశమున్నది. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఐదేళ్ల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఓటర్ల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవని తెలుస్తున్నది. మరోవైపు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు గడువు ఈ నెల 19తో ముగియగా, తుదిజాబితా తయారీలో అధికారయంత్రాగం నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో కొత్తగా 1.37 లక్షల పైచిలుకు దరఖాస్తులు రాగా, వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అర్హులను ధ్రువీకరించడం యంత్రాగానికి సవాలుగానే మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వచ్చేనెల 4న తుదిజాబితా ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, నాలుగు జిల్లాల్లో అర్జీల పరిశీలన యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది.

    కరీంనగర్‌, సెప్టెంబర్‌ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంతో పోలిస్తే ఈసారి ఓటు నమోదుపై అర్హత ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపిస్తున్నది. ప్రస్తుత గణాంకాలను చూస్తే అధికారుల అంచనాలకు మించి నమోదు జరిగినట్లుగా తెలుస్తున్నది. నిజానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏడాది కాలంగా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు ఊరూవాడా తేడా లేకుండా ప్రత్యేక చాటింపు వేయించారు. దీంతోపాటు బూత్‌లెవల్‌లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా అధికారయంత్రాగం చేసిన కృషి వల్ల గతంలో ఎప్పుడూ లేనివిధంగా అర్హులైన పౌరులు తమ ఓటుహక్కు పొందేందుకు ముందుకు వచ్చారు.

    3,23 లక్షలకుపైగా పెరగనున్న ఓటర్లు

    2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23,142 మంది ఓటర్లు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. గత జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితా, అలాగే ఈనెల 19 వరకు కొత్తగా ఓటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. గత జనవరిలో ఇచ్చిన జాబితా ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్లతో పోలిస్తే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. ఈ పెరుగుదల అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆమేరకు అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించి అనుమానాలను నివృత్తి చేసింది. ఇక ఇక్కడితో పెరుగుదల ఆగుతుంది కావచ్చు అని భావించారు.

    అయితే జనవరిలో ఓటరు జాబితా ప్రకటించిన తర్వాతి నుంచి ఈ నెల 19 వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీనిపై అన్ని జిల్లాల్లోనూ విసృతంగా ప్రచారం చేసింది. దాంతో గడువు ముగిసే నాటికి 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 1,37,646 దరఖాస్తులు వచ్చాయి. అంచనా ప్రకారం.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటిలో నూటికి 99 శాతానికిపైగా కరెక్టుగానే ఉంటున్నాయని యంత్రాంగం చెబుతున్నది. ఆ లెక్కన చూస్తే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ దాదాపు ఓటు హక్కు ఇచ్చే అవకాశమున్నది. గత జనవరిలో పెరిగిన 1,85,496 ఓటర్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తులను కలిపి చూస్తే పెరిగే ఓటర్ల సంఖ్య 3,23,142గా కనిపిస్తున్నది.

    నాడు తగ్గినా..నేడు లక్షల్లో పెరుగుదల

    నిజానికి గతంలోనూ ఓటు హక్కు కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా చైతన్యం కనిపించలేదు. దీనికి నిదర్శనం 2018 ఎన్నికలే. 2014తో పోలిస్తే 2018 ఎన్నికల సమయం నాటికి ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ, అలా జరగలేదు. 2014 ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 28,27,556 ఓటర్లు ఉండగా, 2018 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 27,87,549కి తగ్గింది. అంటే ఈ రెండు ఎన్నికల మధ్య 40,007 మంది ఓటర్లు తగ్గారు. అదే 2018 ఎన్నికలు, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నిలకు మధ్య మాత్రం దాదాపు 3.23 లక్షల ఓటర్లు పెరిగే అవకాశమున్నది. ఏ కోణంలోచూసిన ఈ సారి ఓటరు ప్రంభజనం కనిపించనున్నది.

    Posted in Uncategorized

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *