నడిరోడ్డుపై పడిపోయిన వజ్రాల సంచి.. వెతకడానికి ఎగబడ్డ జనం.. చివర్లో ట్విస్ట్ వైరల్ వీడియో

ఓ వ్యక్తి పొరపాటున కొట్లాది రూపాయలు విలువచేసే వజ్రాల సంచిని జారవిడిచినట్టు ప్రచారం సాగడంతో నడిరోడ్డుపై వాటిని వెదకడం కోసం జనం ఎగబడ్డారు. తమకు ఆ మూట దొరక్కపోతుందా? అనే ఆశతో వజ్రాల కోసం వెతుకులాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వజ్రాల వ్యాపారానికి పేరు గాంచిన గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో చోటుచేసుకుంది. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన వరచ్చా ప్రాంతంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు ప్రచారం గుప్పుమంది. నడిరోడ్డుపై పడిపోయిన ఆ ప్యాకెట్‌లో కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

దీంతో ఆ వజ్రాలు తమకు దొరక్కపోతాయా? అని ఎక్కడెక్కడి నుంచో జనం ఎగబడ్డారు. నడిరోడ్డుపై వాహనాలు ఆపి ఆ వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. రోడ్డును ఊడుస్తూ కొందరు, కూర్చుని దుమ్ము ధూళిలో అణువణువూ గాలిస్తూ మరికొందరు వజ్రాల కోసం వెతుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. కొందరికి వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యుయెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ప్రాంక్ అయి ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటన సెప్టెంబరు 24న చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *