వైసీపీ వాళ్లకు సర్వీస్ చేసేది లేదన్న జెనెక్స్.. టాప్ హీరోలు, రాజకీయ ప్రముఖులంతా కస్టమర్లట!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సొంత పార్టీ కేడర్ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీక్షలతో పాటూ వివధి మార్గాల్లో తమ ఆందోళనల్ని నిర్వహిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌‌ను నిరసిస్తూ ఆటోమొబైల్ రంగంలో కార్ కేర్ సేవలు అందిస్తున్న జెనెక్స్ సంస్థ సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న జెనెక్స్ షోరూమ్‌లో.. వైఎస్సార్‌సీపీ చెందిన నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలకు ఎలాంటి సర్వీసులు అందించకూడదని నిర్ణయించింది. చంద్రబాబును అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని జెనెక్స్ సంస్థ ఎండీ అమర్ చెప్పారు.

తన వ్యాపారికి ఇబ్బందే.. కానీ దానిని ఎదుర్కోవడానికి సిద్ధమే అన్నారు. తన తండ్రి పెద్ద బిజినెస్ పర్సన్ ఏమీ కాదని.. తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదన్నారు. తాను 1999లో రూ.3వేలకు జీతం తీసుకున్నానని.. తర్వాత బిజినెస్ ప్రారంభించాను అన్నారు. కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి వచ్చానని.. తాను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే చంద్రబాబు కారణం అన్నారు. ఆర్థికంగా, వ్యాపారపరంగా లాస్ అయినా పర్లేదు కానీ తన నిర్ణయంలో మాత్రం మార్పు ఉండదన్నారు. తాను మళ్లీ పడిపోతే లేవనేననే భయపడటం లేదన్నారు.

తాను తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినిమా హీరోలకు కూడా వాహనాలు డిజైన్ చేసి ఇచ్చానని.. గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని గత 15 రోజులు దగ్గరుండి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలకు వరకు వాహనాలను డిజైన్ చేయించుకున్నారన్నారు. ఇలా ఎందరో వైఎస్సార్‌సీపీ వారికి వాహనాలు డిజైన్ చేశామని.. కానీ ఇక నుంచి కొడాలి నానికి సర్వీస్ చేయను వైఎస్సార్‌సీపీ నేతలకు సర్వీస్ చేసే సమస్యే లేదు అన్నారు.

తమ బ్రాండ్‌కి కొత్తగా పబ్లిసిటీ ఏమి పని లేదని.. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ , పరిటాల శ్రీరామ్ కాన్వాయ్.. ఇలా చాలామంది రాజకీయ ప్రముఖుల వాహనాలను తామే డిజైన్ చేశామన్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాప్ సెలబ్రిటీస్ అందరూ ఎన్నో ఏళ్ల నుండి తమ కస్టమర్స్ అన్నారు అమర్. జనతా గ్యారేజ్ , భరత్ అను నేను , నాపేరు సూర్య , వాల్తేరు వీరయ్య ఇలా 50 పైగా సినిమాలకి హీరో & విలన్స్ వెహికల్ డిజైన్ చేసింది తామేనన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ది వల్ల ఎదిగిన తాము .. ఆయన గారి కోసం ఏమీ చెయ్యలేకపోతున్నాం అనే బాధతో .. ఆయనను ఇబ్బంది పెడుతున్న వాళ్లు & వారిని సపోర్ట్ చేస్తున్నవారికి దూరంగా ఉండాలని మాత్రమే ఈ నిర్ణయం అన్నారు.

తాము జెనెక్స్ సంస్థను 2005లో స్థాపించామని.. ప్రస్తుతం నగరంలో 6జెనెక్స్‌ స్టోర్లను, 50మంది ఉద్యోగులతో రన్‌ చేస్తున్నాను అన్నారు. చంద్రబాబు కారణంగానే మాదాపూర్‌తో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు అప్పుడప్పుడే అభివృద్ధి చెందడం ప్రారంభం అయ్యాయని అన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ నగరం, తమ జెనెక్స్ సంస్థ ఈ స్థాయికి ఎదిగిందంటే.. దానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు వేసిన బీజంతో ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. ఈరోజు తనతో పాటు కోట్ల జనాభా హైదరాబాద్‌లో చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నామంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమన్నారు.

అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నారని తెలిసి తనకు చాలా బాధేసిందని.. కుట్రపన్ని ఆయన్ను జైల్లో పెట్టారని అన్నారు. అందుకే.. తనకు వీలైనంత వరకు చంద్రబాబు మద్దతు ఇవ్వాలని అనుకున్నానని.. అందుకే వైఎస్సార్‌సీపీ వాళ్లకు సర్వీసులు ఆపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తనకు నష్టం వచ్చినా పర్లేదని.. వైఎస్సార్‌సీపీ వాళ్లు ఎవరొచ్చినా మొహమాటం లేకుండా సేల్స్ లేదా సర్వీసులు ఇవ్వమని చెప్పేస్తానన్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని.. ఇది తన వ్యాపార నిర్ణయమని.. చంద్రబాబుకి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నానని జెనెక్స్ ఎంపీ అమర్ చెప్పారు. స్టోర్ల ముందు బోర్డులు కూడా ఏర్పాటు చేశామని.. చంద్రబాబుకు న్యాయం జరిగే వరకు నిరసనను కొనసాగిస్తామన్నారు.

Read More Andhra Pradesh News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *