హైదరాబాద్‌లో నకిలీ పోలీసులు.. ఫేక్ చెకింగ్లు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో హోల్‌సేల్ వ్యాపారులను నకిలీ ఈసీ అధికారులు, ఫేక్ పోలీసుల భయం వెంటాడుతున్నది. ఈసీ, పోలీసుల పేరుతో స్థానిక రౌడీ షీటర్లు, వివిధ పార్టీల గల్లీ లీడర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దో నంబర్ దందా ఎక్కువగా జరిగే హోల్‌సేల్ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్ చేసి అందినంత దోచేస్తున్నారు. బేగంబజార్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ సహా గోల్డ్ బిజినెస్ జరిగే పాన్ మార్కెట్ వ్యాపారులకు ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి.
రూ.కోట్ల నగదు లావాదేవీలు
హోల్‌సేల్ మార్కెట్లలో ప్రతి రోజు రూ.కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయి. జీఎస్టీ సహా ఇతర ట్యాక్స్‌లను తప్పించుకునేందుకు రెండు రకాల వ్యాపారాలు చేస్తుంటారు. బిల్‌తో ఎక్కువ రేటు, బిల్ లేకుండా తక్కువ ధరకు అమ్మకాలు జరుగుతుంటాయి. ఇలాంటి చోట డిజిటల్, ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా డబ్బులు మాత్రమే తీసుకుంటారు. దీంతో ప్రతి వ్యాపారి వద్ద నోట్ల కట్టలు ఉంటాయి. ఈ డబ్బును వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయరు. ట్యాక్స్‌లు, అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. రోజువారి కలెక్షన్‌తో ఇంటికి వెళ్తున్న వ్యాపారులను కేటుగాళ్లు టార్గెట్‌చేస్తున్నారు.
పోలీసులమని చెప్పి..
రాత్రి వ్యాపారులు ఇంటికి వెళ్లే సమయాల్లో హోల్‌సేల్ మార్కెట్ల వద్ద సంచరిస్తున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురికి పైగా ఉంటున్నారు. వ్యాపారులు కొద్ది దూరం వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకుంటున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి బెదిరిస్తున్నారు. డబ్బును ఈసీకి అప్పగించకుండా ఉండాలంటే ఎంతో కొంత ఇచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలా వారం రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యాపారులను బెదిరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే డయల్ 100కు లేదా స్థానిక పీఎస్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
‘‘గోషామహల్‌కు చెందిన హోల్‌సేల్ ఓ వ్యాపారి సోమవారం రాత్రి రూ.25 లక్షలతో ఇంటికి బయలుదేరాడు. మెయిన్ రోడ్లపై పోలీస్ చెక్‌పోస్ట్‌లు ఉండడంతో గల్లీల నుంచి వెళ్తున్నాడు. వ్యాపారిని వెంబడించిన ఇద్దరు యువకులు బైక్ అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. వ్యాపారి వద్ద రూ.5 వేలు తీసుకుని వదిలేశారు. బాధితుడు స్థానిక పోలీసులకు ఈ సమాచారం ఇచ్చాడు.’’
©️ VIL Media Pvt Ltd.